కాంట్రాక్టర్ల గు‘బిల్లు’
పనులు వేగవంతం చేస్తున్నాం
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన రూ.3.6 కోట్ల పనులకు సంబంధించిన 40 టెండర్లలో ఒక్క కాంట్రాక్టర్ కూడా పాల్గొనలేదు.
అక్టోబర్1న పిలిచిన రూ.70లక్షల పనులకు సంబంధించిన 17 టెండర్లలో కేవలం మూడు పనులకే కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు.
అదే నెల 3న రూ. 1.20కోట్లకు సంబంధించిన 18 పనులకు గాను కేవలం 4 పనులకు టెండర్లు వచ్చాయి.
అదేనెల 8న రూ.1.71 కోట్లకు సంబంధించిన 18 పనులకు కేవలం ఒక్క టెండరే వచ్చింది.
దీంతో ఇంజనీరింగ్ అధికారులు గత నెల 31న మరోసారి అవే పనులకు టెండర్లు పిలచారు. ఈనెల 7న రూ.1.8కోట్ల పనులకు సంబంధించిన 24 వనులకు టెండర్లు తెరవగా కేవలం ఎనిమిది దరఖాస్తులే వచ్చాయి.
ఈనెల 14న రూ.6.99కోట్ల పనులకు 52 టెండర్లు తెరవనున్నారు. దీనిని బట్టి చూస్తే కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
తెనాలి అర్బన్: ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, బిల్లుల చెల్లింపుల జాప్యంతో తెనాలి పట్టణాభివృద్ధి మందకొడిగా సాగుతోంది. 5వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్, వివిధ గ్రాంట్ల కింద నిధులు విడుదల అవుతున్నా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి కన్పించడం లేదు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు సైతం ఇంజినీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయడంలో విఫలం అయ్యారనే చెప్పవచ్చు. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పిలిచిన పనులకే మళ్లీ మళ్లీ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతినెలా జరిగే కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రెండు నెలల కిందట కౌన్సిలర్లు సూచించారు. నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు.
జిల్లాలోనే ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ
తెనాలి పట్టణం 16.77కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 55,917 ఇళ్లు ఉన్నాయి. 2.60లక్షల జనాభాతో జిల్లాలోనే ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పేరుగాంచింది. ప్రతి ఏడాది వివిధ పన్నులు, షాపుల అద్దెల ద్వారా రూ.36 కోట్ల ఆదాయం వస్తోంది. ఇవికాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇతర స్పెషల్ గ్రాంట్ల ద్వారా రూ.70కోట్ల వరకు నిధులు సమకూరుతుంటాయి.
ఆ ఇద్దరిదే అక్కడ హవా !
తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఇంజినీరింగ్ విభాగంలో ఆ ఇద్దరిదే హవా నడుస్తోంది. వారు ఇద్దరు కరుణిస్తేనే బిల్లుల చెల్లింపులు జరిగేది. దీంతో అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇద్దరిలో ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ అని తెలుస్తోంది దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదన్న చందంగా విభాగంలో పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంజినీరింగ్ విభాగాన్ని శాసిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. అధికారుల సహా అతడి మాట వినాల్సిందే. అతడికి నచ్చిన వారి బిల్లులను మాత్రమే అన్‌లైన్ చేస్తాడని, వాటిని ముందు వరుసలో పెట్టి నిధులు జమ అయ్యేలా చూస్తాడనే ఆరోపణ ఉంది. రెండో వ్యక్తి చెబితేనే సదరు కంప్యూటర్ ఆపరేటర్ అన్‌లైన్ చేస్తుంటారనే ప్రచారం ఉంది.
కమీషన్లు ఇచ్చినా జరగని చెల్లింపులు
మున్సిపల్ కార్యాలయ అధికారులు పనితీరు వివాదాస్పదంగా మారింది. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారి అధిక కమీషన్‌లకు తెరతీశారనే ఆరోపణ వినిపిస్తోంది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు వెంటనే జరగాలంటే రెండు శాతం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా కమీషన్ ఇస్తేనే చెల్లింపులు జరిగేలా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఒకరిని, ఇంజనీరింగ్ విభాగంలో మరొకరిని ఏజెంటుగా పెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్క్ ఇన్స్‌పెక్టర్లు, ఏఈలు, డీఈలు, ఆడిట్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు.. ఇలా అందరికీ ముందుగా కమిషన్ ఇస్తున్నా బిల్లుల చెల్లింపులలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంటుందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
తెనాలికి రానున్న రూ.70కోట్ల నిధులు.
పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు నిధులను తెస్తున్నారు. దీనిలో భాగంగా స్పెషల్ గ్రాంట్ కింద రూ.35కోట్లు, సీఆర్‌డీఎ గ్రాంట్ రూ.20కోట్లు, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.9కోట్లు, బీపీఎస్ గ్రాంట్ రూ.4కోట్లు త్వరలో రానున్నాయి. వీటికి సంబంధించిన అనుమతులు ఇప్పటికే మున్సిపాలిటీకి అందాయి. వీటిని కూడా సకాలంలో ఇంజినీరింగ్ అధికారులు ఉపయోగించకపోతే వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ఇంజినీరింగ్ విభాగంలో సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ప్రారంభానికి నోచుకోని పనుల్ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువగా పాల్గొనని మాట వాస్తవం. బిల్లుల చెల్లింపులు కొద్ది రోజుల నుంచి ప్రారంభం అయ్యాయి. దీంతో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. పనులు పూర్తయిన వెంటనే నిధి యాప్‌లో బిల్లులు రూపొందించి ఆమోదం తెలపాలని అధికారులను ఆదేశించాం. వాటిలో ఎక్కడా జాప్యం జరగకుండా చూస్తాం.
–పినప శ్రీకాంత్,
మున్సిపల్ ఇంజనీర్, తెనాలి.
గతంలో టెండర్లు వేసిన వెంటనే వాటిని దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతుండే వారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
కాంట్రాక్టర్ల గు‘బిల్లు’


