అర్జీల పరిష్కారంలో సంతృప్తి స్థాయి పెరగాలి
గుంటూరు వెస్ట్: ప్రజలు నుంచి వివిధ శాఖలకు అందించిన అర్జీలను దరఖాస్తుదారుల సంతృప్తి స్థాయి మెరుగుపరిచేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె మాట్లాడారు. అర్జీలను క్షేత్రస్థాయిలో సక్రమంగా విచారించి పరిష్కరించాలని తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ దరఖాస్తుదారులకు కచ్చితంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ముఖ్యమైన అంశాల జాబితాను తయారు చేసుకోవాలని, అడిగినప్పుడు వెంటనే స్పందించేలా ఉండాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఓ గ్రీవెన్స్ వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం వచ్చిన 261 అర్జీలను కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


