ఇల్లు కొనాలంటే మాటలు కాదు. ఇంటి నాణ్యత, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు గురించి కచ్చితంగా తనిఖీ చేసుకుంటాం. ఒకటిరెండు సార్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని చెక్ చేసుకుని మరీ ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం కదా. మరి కోటిన్నర రూపాయలు పెట్టి కొన్న ఒక అపార్ట్‌మెంట్ గోడ ఒక్క పెన్సిల్ మొనకే రంధ్రం పడితే.. గుండె గుభిల్లు మనదూ.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది.
నోయిడాకు చెందిన వ్యక్తి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ గోడకు పెన్సిల్తో రంధ్రం చేయడం చర్చనీయాంశమైంది. నోయిడా నివాసి తన రూ.1.5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ గోడకు చెక్క పెన్సిల్‌తో రంధ్రం చేశాడు.ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఖరీదైన గృహనిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే భద్రత , సామగ్రి గురించి ఆందోళనలను రేకెత్తించింది.
kabeer.unfiltered' అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన వీడియోలో, తన ప్రీమియం అపార్ట్‌మెంట్ గోడలోకి చెక్క పెన్సిల్‌ను సుత్తితో కొట్టడాన్ని చూడొచ్చు. కేవలం పెన్సీల్‌తో గోడకు సుత్తి సాయంతో రంధ్రం చేశానని తెలిపాడు. మొదట డ్రిల్‌ను ఉపయోచాలని చూశా. కానీ డ్రిల్ కూడా అవసరం లేకుండానే, పెన్సిల్ నేరుగా గోడలోకి దిగిపోయింది. ఇది మనం పాఠశాలలో వాడే గ్రాఫైట్ పెన్సిలే. ఈ ఇల్లు అంత బలంగా ఉంది అని రాసుకొచ్చాడు.
దీనిపై చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోవడం బాధాకరం అంటూ వాపోయారు. మరికొందరు భిన్నమైన దృక్పథాన్ని అందించారు. AAC (ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్) గోడలు అని, ఈ తేలికైన గోడలను ఎత్తైన నిర్మాణంలో ఉపయోగిస్తారని, భూకంపాల సమయంలో ఇది సురక్షితంగా, మరింత స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ గోడలు భారాన్ని మోసేవి కావు , సాంప్రదాయ ఇటుక, మోర్టార్ గోడల మాదిరిగా ఉండవని వివరణ ఇచ్చారు. పేరు తగ్గట్టే ఏఏసీ గోడలు. ఇవి డ్రిల్లింగ్‌కు ఈజీగా ఉంటాయ్.. అందుకే తెలుసుకొని మాట్లాడాలి అంటూ కమెంట్ చేశారు.
కాగా ఈ వీడియో ప్రామాణికత, గోడ నాణ్యత లాంటి విషయాలపై క్లారిటీ లేదు. ఈ వీడియోలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా తన వ్యక్తిగత అనుభవాలు ,పరిశీలనల ఆధారంతో రాసింది . ఈ కంటెంట్ ఏ వ్యక్తిని, కంపెనీని లేదా సంస్థను కించపరచడానికి ఉద్దేశించింది కాదంటూ డిస్‌క్లైమర్ కూడా ఇచ్చాడు. ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్‌లు తేలికైన, ప్రీకాస్ట్ నిర్మాణ సామగ్రి. వీటితో ఖర్చు తక్కువ. తేలికైనవి, సౌకర్యవంతమైనవి, మన్నికైనవి కూడా. అద్భుతమైన ఇన్సులేషన్ లక్షణాలను కలిగి ఉంటాయి.వీటి వలన భవనం చల్లగా ఉంటుంది. అగ్ని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. చెద లాంటి సమస్యలు కూడా ఉండవు.
ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద


