విద్యార్థుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాలు, వీసా నిబంధనలు
విదేశీ వర్సిటీల ర్యాంకులకన్నా తక్కువ చదువు ఖర్చులతో అధిక నైపుణ్యానికే ప్రాధాన్యం
యూఎస్, యూకేకు బదులు ట్యూషన్ ఫీజురహిత జర్మనీ వంటి దేశాల్లో చదివేందుకు ఆసక్తి
లీప్ స్కాలర్ తాజా నివేదికలో వెల్లడి
‘విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీల్లో చదువుకోవాలి. కోర్సు పూర్తి కాగానే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాలి’అన్నది భారతీయ విద్యార్థుల కల. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు, వీసా విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ర్యాంకుల బదులుగా తక్కువగా ఉండే విదేశీ చదువు ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు, చేసిన ఖర్చుకు వచ్చే రాబడి వంటి అంశాలు విద్యార్థుల ‘విదేశీ విద్య’నిర్ణయాలను అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
మార్కెట్ విలువ ఆధారంగా లెక్కలు..
మంచి జరుగుతుందని వేచి చూసే ధోరణి గతం. ఈ విధానం నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. చేయబోయే కోర్సు లేదా డిగ్రీ ఉత్తమమైనదా కాదా అని బేరీజు వేసుకొనే రోజులు వచ్చాయి. ప్రపంచ పోటీ నేపథ్యంలో ప్రతి డిగ్రీకి మార్కెట్ విలువ ఉందా అని లెక్కలు వేసుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులకు సహాయం, సమాచారం అందిస్తున్న లీప్ స్కాలర్ అనే కంపెనీ 2020–2025 మధ్య 30 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణుల దరఖాస్తులు, పరస్పర సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
తక్కువ వ్యయంతో..
‘విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లగలనా’అనే సందేహం స్థానంలో ‘ఈ డిగ్రీ నాకు నిజంగా ఏమి ఇస్తుంది’అని విద్యార్థులు ప్రస్తుతం ప్రశ్నించుకుంటున్నారు. యూఏఈలో చదువుకోవడానికి పెరిగిన 55 రెట్ల ఆసక్తి మొదలు.. ట్యూషన్ ఫీజురహిత జర్మనీలో అడుగుపెట్టాలన్న కుతూహలం వరకు.. భారతీయ విద్యార్థులు తక్కువ వ్యయంతో అధిక నైపుణ్యాన్ని అందించే దేశాల కోసం ప్రపంచ పటాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు వృత్తి నిపుణులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్న డిమాండ్ కారణంగా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మాస్టర్స్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 186% పెరిగింది.
తిరిగి ఏం లభిస్తుంది?
చదువుకు నిధులు సమకూర్చుకోవడం నుంచి కెరీర్‌కు ఆర్థిక సాయం చేసుకోవడం వైపు విద్యార్థుల ఆలోచనలు మళ్లుతున్నాయి. స్పష్టమైన కెరీర్ మార్గాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగేలా ఉపాధి, దీర్ఘకాలిక నివాస స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2025–26లో ఆశావహులు విద్యను వ్యూహాత్మక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక నిర్దిష్ట డిగ్రీ వారి దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లెక్కించడానికి అభ్యాసంపై రాబడిని (రిటర్న్ ఆన్ లెర్నింగ్) కొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలేజీల్లో ప్రవేశాలు కేవలం డిగ్రీ గురించి కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్లో స్థానం సంపాదించడం కోసం అని స్పష్టం అవుతోంది.
రూట్ మారింది..
సంప్రదాయ కేంద్రాలకు అతీతంగా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాలు మారుతున్నాయి. సంప్రదాయ కేంద్రాలైన యూఎస్, యూకే, కెనడా, ఆ్రస్టేలియాలో అధిక ఖర్చులు, మారుతున్న వీసా నిబంధనలు విద్యార్థుల ప్రాథమ్యాలను మార్చాయి. వారసత్వ ప్రతిష్ట కంటే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను యూఏఈకి 5,400%, న్యూజిలాండ్ 2,900%, జర్మనీకి 377% దరఖాస్తులు పెరగడం ఇందుకు నిదర్శనం.
కెరీర్ పురోగతికే పట్టం..
⇒ 85% మంది అభ్యర్థులు విద్యార్హతల కంటే చదువు తర్వాత కెరీర్ పురోగతికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
⇒ 68% మంది విద్యార్థులు ‘అందుబాటులో వ్యయాలు’అత్యంత ప్రాధాన్యంగా పేర్కొంటున్నారు.
⇒ విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న అభ్యర్థుల్లో 65.5% మంది 18–25 ఏళ్ల వయస్కులు.
⇒ 26 ఏళ్లకుపైగా ఉన్నవారి వాటా 34.5%. కెరీర్ పురోగతికై ప్రత్యేక డిగ్రీలను వృత్తి నిపుణులు కోరుకుంటున్నారు.
⇒ విద్యార్థుల్లో పురుషులు 58%, మహిళలు 42% ఉన్నారు.
⇒ అభ్యర్థుల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ 54.7%, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కోరుకునేవారు 23.7% ఉన్నారు.
⇒ దరఖాస్తుల్లో 6.3% పీహెచ్‌డీ కోసం అభ్యరి్థంచినవే. వీటి సంఖ్య ఏడాదిలో 60% పెరిగింది.
ఏఐపై పట్టు సాధించేందుకు..
⇒ ఏఐ కోర్సుల్లో ప్రత్యేక మాస్టర్స్ ప్రవేశాలు 2023తో పోలిస్తే 2024లో దాదాపు 3 రెట్లు పెరిగాయి.
⇒ ఈ విద్యార్థులలో 49.9% మంది పూర్తిగా రంగాలను మార్చడం కంటే మార్కెటింగ్ అనలిటిక్స్, ఫైనాన్స్ వంటి వారి ప్రస్తుత రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
⇒ ఏఐ కోర్సులు చేద్దామనుకుంటున్న ఆశావహుల్లో దాదాపు 36% మంది ఇప్పటికే వృత్తి నిపుణులు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడం వృత్తిపరంగా అవసరమని వారు రుజువు చేస్తున్నారు.


