చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజాపేట: మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదివారం రాజాపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బర్ల పెంటయ్య(42), కవిత దంపతులు అదే గ్రామానికి చెందిన బోళ్ల రాఘవరెడ్డి పౌల్ట్రీఫామ్‌లో పనిచేస్తున్నారు. వారికి ఊర్లో సొంతం ఇల్లు ఉన్నప్పటికీ అది చిన్నగా ఉండడంతో పౌల్ట్రీఫామ్‌లోనే ఓ గదిలో నివాసముంటున్నారు. పెంటయ్య గురువారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. అనంతరం అదే ఊర్లో ఉంటున్న తన తల్లి దగ్గరకు వెళ్తానని భార్యకు చెప్పగా.. రాత్రివేళ మద్యం మత్తులో బయటకు వెళ్లొద్దని ఆమె చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన పెంటయ్య పౌల్ట్రీఫామ్ వెనుకకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి తాను పురుగుల మందు తాగినట్లు తన పెద్ద కుమారుడు పరుశరాములుకు చెప్పాడు. వెంటనే పెంటయ్యను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆదివారం మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


