మినీ స్టేడియం పనులు జాప్యం
సారంగాపూర్: మండలంలోని పోతారం శివారు గణేష్‌పల్లిలో మినీస్టేడియం నిర్మాణ పనులు మొదలు కాలేదు. 2016–17లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని మండలవాసులు కోరడంతో అప్పటి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. గ్రామ శివారుల్లో 6.5 ఎకరాల భూమి సేకరించిన రెవెన్యూ అధికారులు.. సర్వే చేసి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు.
రూ.2.65 కోట్లు మంజూరు
భూసేకరణ జరిగిన తరువాత ప్రభుత్వం స్టేడియం నిర్మాణానికి రూ.2.65 కోట్లు మంజూరీ చేసింది. నిర్మాణం పూర్తయితే వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, టెన్నిస్, కబడ్డీ, బ్యాడ్మింటన్ (షటిల్), ఇతర ఇండోర్ గేమ్స్ నిర్వహించడానికి వీలుంది. స్టేడియంలో పెవిలియన్ బిల్డింగ్, ఇండోర్ హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టాలని భావించారు. స్టేడియం పూర్తయితే బీర్‌పూర్ మండలంలోని 17 గ్రామాలు, సారంగాపూర్ మండలంలోని 18 గ్రామాల క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. కానీ.. పనులు ప్రారంభించకపోవడంతో క్రీడాకారుల ఆశ నీరుగారిపోతోంది.
టెండరు ప్రక్రియ పనులు
మినిస్టేడియం నిర్మాణం కోసం టెండరు ప్రక్రియ పనులు పురోగతిలో ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. సాంకేతిక పనులు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.


