ర్యాగింగ్‌ వద్దు.. స్నేహం ముద్దు | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ వద్దు.. స్నేహం ముద్దు

Nov 10 2025 8:04 AM | Updated on Nov 10 2025 8:04 AM

ర్యాగ

ర్యాగింగ్‌ వద్దు.. స్నేహం ముద్దు

సరికొత్త ఆశలతో కళాశాలలకు జూనియర్లు భయపెడుతున్న ర్యాగింగ్‌ భూతం తాజాగా నాచుపల్లి జేఎన్‌టీయూలో ఘటన..? పర్యవేక్షణ, అవగాహన పెంచాలంటున్న తల్లిదండ్రులు

కరీంనగర్‌టౌన్‌/కొడిమ్యాల: కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలతో డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలో అడుగు పెట్టిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు పరిచయం అవుతారు. తొలి పరిచయానికి పర్యాయపదంగా నిలవాల్సిన ర్యాగ్‌ అన్న పదం వికృత క్రీడకు చిహ్నమవుతోంది. ఆ పేరు చెబితేనే జూని యర్ల వెన్నులో వణుకుపుడుతోంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం పతాకస్థాయికి చేరుకుంటోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూలో శనివారం రాత్రి సీనియర్లు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి.

స్నేహమా.. జాగ్రత్త సుమా

మంచి స్నేహం ప్రాణంతో సమానం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరికీ స్నేహం అవసరం. కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు స్నేహితుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల క్యాంటీన్లు, హాస్టళ్లకు పాకిన ఈ భూతానికి ఏటా ఎంతో మంది విద్యార్థులు బలవుతుండగా విద్యాశాఖ, పోలీసు విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

‘సుప్రీం’ మార్గదర్శకాలు

సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కే రాఘవన్‌ కమిటీ వేసిన సిఫార్సులను 2007లో ఆమోదించింది. దీని ప్రకారం ర్యాగింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు అందితే వెంటనే విద్యా సంస్థలు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణుడిని నియమించాలి. విద్యార్థులు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాల యజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్‌ నిరోధించడంలో యజమాన్యాలు విఫలమైతే వారినే బాధ్యులను చేయాలి.

‘యూజీసీ’ మార్గదర్శకాలు

ర్యాగింగ్‌ సంఘటనల్లో దోషులుగా తేలిన వారికి రూ.2.5 లక్షల జరిమానాల విధించాలి. తీవ్రతను బట్టి వారిని కళాశాల ప్రవేశంపై జీవితకాల నిషేధం విధించాలి. కళాశాలలో చేరే సమయంలో వేధింపులకు పాల్పడబోమని విద్యార్థి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి. వేధింపులను అరికట్టడంలో విఫలమైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ర్యాగింగ్‌ నిబంధనలను తెలుపుతూ ప్రతి కళాశాల పరిసరాల్లో పోస్టర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి.

సర్కారు ఏం చెబుతోందంటే..

ర్యాగింగ్‌ నిరోధకానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్యశాఖ 1800– 5522 ట్రోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను 1090 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపవచ్చు. ర్యాగింగ్‌ జరిగే కళాశాలల వద్ద నిఘా పెంచాలి.

వైద్య నిపుణుల సూచనలు

ర్యాగింగ్‌ తప్పనే విషయాన్ని సీనియర్లకు తెలిపేందుకు కాలేజీల్లో నైతిక విలువల కమిటీ లేదా మానవ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్‌ చేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జూనియర్లకు అవగాహన కల్పించాలి. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తే మిగతా వారికి కనువిప్పు కలుగుతుంది. కళాశాల యజమాన్యాలు నిజాలను దాచకుండా వెలుగులోకి తేవాలి. జూనియర్లు స్వేచ్ఛగా మసలేలా చర్యలు తీసుకోవాలి.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలు

డిగ్రీ

66

పీజీ

35

ఇంజినీరింగ్‌

16

ఎంబీఏ

8

ఎంసీఏ

1

ఫార్మసీ

2

పాలిటెక్నిక్‌

5

ర్యాగింగ్‌ వద్దు.. స్నేహం ముద్దు1
1/1

ర్యాగింగ్‌ వద్దు.. స్నేహం ముద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement