ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన సూర శ్యాంరాజ్(24) ప్రమాదవశాత్తు బావిలోపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం బయటకు వెళ్తున్నానని తన తమ్ముడు రంజిత్‌కు చెప్పిన శ్యాంరాజ్.. సాయంత్రమైనా ఇంటికి రాలేదు. అనుమానంతో కుటుంబ పభ్యులు వెతికినా జాడతెలియలేదు. సోమవారం మల్యాల గ్రామ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో శవమై తేలాడు. మృతుడి తండ్రి సూర మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
తనయుడి చేతిలో గాయపడిన తండ్రి..
మెట్‌పల్లి: తనయుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్ల గంగనర్సయ్య (74) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పెళ్లి చేయడం లేదనే ఆగ్రహంతోనే తండ్రిని కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన గంగనర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అన్వేష్(32) ఉన్నాడు. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన అతను కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని వివాహం కోసం తండ్రి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుదరడం లేదు. తండ్రిపై కక్ష పెంచుకున్న అన్వేష్.. ఆదివారం ఉదయం అతనితో గొడవకు దిగాడు. కర్రతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న కుమార్తె హారిక ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చెట్టును ఢీకొట్టిన బైక్.. యువకుడు..
మంథనిరూరల్: అదుపు తప్పిన ద్విచక్రవాహనం చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన మంథని మండలం వెంకటాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని మంథని– కాటారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తళ్లూరి సాయి శ్రావణ్(27) మృతి చెందాడు. కాటారం వైపు నుంచి మంథనికి వస్తుండగా వెంకటాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలై సాయిశ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సింగిరేణి ఉద్యోగ శిక్షణలో భాగంగా తన ద్విచక్రవాహనంపై భూపాలపల్లి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమకు ఫిర్యాదు అందలేదని మంథని ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి


