నిప్పంటించుకుని వృద్ధుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు మచ్చ జలందర్(60) సోమవారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్లుగా కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జలందర్ సోమవారం మధ్యాహ్నం ఇంటివద్ద ఎవరూలేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.
గంజాయి వికేత్రల అరెస్టు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామశివారులోని శ్రీసీతారామస్వామి కమాన్‌వద్ద సోమవారం ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. వెంకటాపూర్‌కు చెందిన మామిండ్ల వికాస్, మరాటి విక్కీలు ఇద్దరు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని కోర్టులో హాజరుపర్చామని అన్నారు. ఎవరైనా గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయి పట్టివేత
ధర్మపురి: మండలంలోని రాయపట్నం వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిలాకు చెందిన తగరపు రాజు తన స్కూటిలో గంజాయి తరలిస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రాజు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా.. గంజాయి లభించింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


