సాహితీ శిఖరం.. అందెశ్రీ
విద్యానగర్(కరీంనగర్): మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు అంటూ ఆర్థిక సంబంధాలతో ముడిపడిపోయిన మానవ సంబంధాలపై ఆవేదన వ్యక్తం చేసి.. జయ జయహే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర సాధనలో అన్ని వర్గాల్లో ఆలోచనలను రేకేత్తిస్తూ.. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అందరినీ సంఘటితం చేసేలా తెలంగాణ ఘనత, కీర్తిని గగనంలో నిలిపిన సాహితీ శిఖరం సోమవారం తెల్లవారుజామున నేలకొరిగింది. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అందించిన వరంగల్‌కు చెందిన ప్రజాకవి అందె ఎల్లన్న అలియాస్ అందెశ్రీ హైదరాబాద్‌లో కన్నుమూశారు. పశువుల కాపరి నుంచి పాటల రచయితగా, ప్రజావాగ్గేయకారుడిగా రాణించిన ఆయన.. బడిలో చదువుకున్న పాఠాలు, జీవితం నేర్పిన గుణపాఠాలతో అణగారిన సమాజానికి దిక్సూచి అయ్యారు. సాహితీ విలువలను తన రచనలు, పాటల ద్వారా సమాజ ఉన్నతికి అందించిన అందెశ్రీకి ఉమ్మడి కరీంనగర్‌తో, సాహితీరంగంతో, సాహితీవేత్తలతో వీడదీయరాని బంధం ఉంది. పలుమార్లు కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కరీంనగర్‌తో అనుబంధం
కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ మాండలిక సాహిత్యం అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ వారు కరీంనగర్ కళాభారతిలో 2011లో నిర్వహించిన కార్యక్రమానికి, తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ప్రతీ పౌర్ణమి రోజు నిర్వహించే ఎన్నీల ముచ్చట్లు 2014లో జరిగిన ప్రథమ వార్షికోత్సవానికి, 2017లో జరిగిన నాలుగో వార్షికోత్సవానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సభలకు ఆయన పలుమార్లు హాజరయ్యారు.
ఉద్యమ చరిత్రలో సమున్నత స్థానాన్ని దక్కించుకున్న జయ జయహే తెలంగాణ గీతం
కరీంనగర్ సాహితీవేత్తలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం


