‘పది’లం దిశగా..
ఫలితాల్లో గతంలో నంబర్–1గా నిలిచిన జిల్లా క్రమంగా పడిపోయిన ఫలితాల ర్యాంకు నంబర్‌వన్‌గా నిలిచేందుకు కసరత్తు ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుల దృష్టి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విద్యాశాఖ
మార్గదర్శకాలివే...
జగిత్యాల: పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు నంబర్‌వన్ ర్యాంక్ రావాలన్న ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్ట్‌లో పూర్తి చదవడం, రాయడం, పరీక్షలకు సంబంధించి భయం తొలగించేలా కృషి చేస్తున్నారు. జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో వరుసగా హ్యాట్రిక్ సాధించింది. అనంతరం అట్టడుగు స్థానానికి పడిపోయింది. దీంతో కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు పలు కార్యక్రమాలు అమలు చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పరీక్షలంటే భయం వద్దని, ప్రశాంతంగా రాయాలని సూచించారు. ఫలితంగా గతేడాది రాష్ట్రంలో నాల్గో స్థానం సాధించింది. ఈసారి సైతం మొదటి స్థానం సాధించేలా ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ప్రత్యేక క్లాసుల నిర్వహణ
పదో తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. డిసెంబర్ చివరి వరకు మరిన్ని క్లాసులు పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతానికి కంటే మెరుగ్గా ఫలితాలు సాధించాలని పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. డిసెంబర్ 31 వరకు ఈ క్లాసులు నిర్వహించి జనవరి ఒకటి నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మాత్రమే రెండుసార్లు ప్రత్యేక తరగతులు కొనసాగించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు తీసుకోనున్నారు.
పాఠశాలలపై వారానికోసారి సమీక్ష
ప్రతి పాఠశాలలో వారానికి ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల కాంప్లెక్స్ అధికారులు, విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. అలాగే ప్రత్యేక క్లాసులకుగానీ, బడికి రాకపోవడం వంటి విద్యార్థులను గమనించి వారి ఇంటికి వెళ్లి వారిని మళ్లీ క్లాసులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 98.20 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. ఈసారి 12,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఉపాధ్యాయుల సిలబస్‌ను జనవరి 10లోపు పూర్తి చేయాలి.
తర్వాత రివిజన్ తరగతులు ప్రారంభించి ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఏ–1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఏబీసీ గ్రూపులుగా విభజించాలి.
సీ గ్రూపు విద్యార్థులకు పునరుచ్చరణ తరగతులు, స్లిప్ టెస్ట్‌లు నిర్వహించాలి.
ప్రతి ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి సూచనలు ఇవ్వాలి.
వందశాతం హాజరయ్యేలా చూడాలి.
‘పది’లం దిశగా..


