సండే సందడి.. పర్యాటకుల కోలాహలం
వెంకటాపురం(ఎం)/ఎస్‌ఎస్‌తాడ్వాయి/వాజేడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం వచ్చిందంటే కోలాహలంగా మారిపోతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు వ్యాపారులు పిల్లాపాపలతో తరలివచ్చి ఆనందంగా గడుపుతున్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, మేడారంలోని వనదేవతల దర్శనం, మంగపేటలోని మల్లూరులో గల హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. అలాగే వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో గల బొగత జలపాతానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొలనులో స్నానాలు చేస్తూ సందడిగా గడుపుతున్నారు.
అమ్మవార్లకు మొక్కులు
తాడ్వాయి మండలంలోని మేడారంలో గల సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.
బొగతలో ఆనందంగా..
వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో గల బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో పర్యాటకులు జలపాతానికి తరలివచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించి సందడి చేశారు. జిప్‌లైన్‌పై ఆటలాడుకుని సరదాగా గడిపారు. సమీప కొలనులో స్నానాలు చేసి కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు.


