ఓరుగల్లు శోకసంద్రం
అందెశ్రీ అస్తమయం..
ఉమ్మడి జిల్లాతో విడదీయలేని అనుబంధం
‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. జంఝా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం.. ఓహోహో.. ఒకటే మరణం ఆహాహా.. జీవితమంతా ఓహోహో.. జనమే మననం.. ఆహాహా.. కష్టాల్ నష్టాల్ ఎన్నెదురైనా కార్యదీక్షతో తెలంగాణ.. జై బోలో తెలంగాణ.. గళ గర్జనల జడివాన’ అంటూ పాటల రూపంలో తెలంగాణ వాదాన్ని ఇంటింటికీ చేర్చిన అందెశ్రీ మరణ వార్తతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయనతో ఓరుగల్లుకున్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. – జనగామ/కేయూ క్యాంపస్/మహబూబాబాద్ రూరల్
పాత ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ (అందె ఎల్ల య్య) చదువుకోలేకపోయినా జీవితానుభవాలే పాఠ్యగ్రంథాలుగా మార్చుకున్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని, కష్టజీవుల్లో పోరాటస్ఫూర్తిని రగిలించే పాటలతో ఆయన ప్రజాకవిగా వెలు గొందారు. 1985–90 మధ్యకాలంలో జనగామ అంబేడ్కర్ నగర్‌లోని అభ్యుదయ కవి జీవై గిరి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డితో సాహిత్య, సామాజిక చర్చలు సాగించిన అందెశ్రీ, జనగామ కవులు, కళాకారులతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాంబరాజు యాదగిరి రచించిన ‘స్వేచ్ఛా గీతం’ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజ రయ్యారు.
ప్రకృతిలోని అనుభవమే ఆయన పాటలు..
అందెశ్రీ పాఠశా ల స్థాయి విద్య కూడా చదవలే దు. పల్లె ప్రకృతి తో గొర్రెల కాపరి గా బాల్యం గడిచింది. ప్రకృతిలోని అనుభవమే ఆయన పాటలు, కవిత్వం సహజసిద్ధమైన ఆశువు కవిత్వంగా మారింది. ఆయన కవిత్వా ప్రతిభను గుర్తించి కాకతీయ యూనివర్సిటీ 2008, జనవరి 31న నిర్వహించిన 18వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను అప్పటి వీసీ ఆచార్య ఎన్.లింగమూర్తి చేతులమీదుగా అందించింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ కేంద్రబిందువుగా కొనసాగిన పోరాట సమయంలోనూ యూనివర్సిటీని సందర్శించారు. తెలుగు విభాగంలో నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్నారు. ఆయన చేసిన సాహిత్య కృషికి కాళోజీ ఫౌండేషన్,ప్రజాకవి కాళోజీ స్మారక పురస్కారాన్నిఅందించింది. అప్పట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు తదితర రచయితల చేతులమీదుగా అందెశ్రీ అవార్డు అందుకున్నారు.
మానుకోటకు రెండు సార్లు..
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సమైక్య విద్యాసంస్థల్లో 2008, 2009 సంవత్సరాల్లో జరిగిన విద్యార్థుల స్వాగత, వీడ్కోలు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచి భవిష్యత్ ఏర్పడే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే కురవి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకున్నారు. చిన్నగూడూరులోని దాశరథి కృష్ణమాచార్యుల విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయన స్వస్థలం పాత
ఉమ్మడి జిల్లాలోని రేబర్తి..
తెలంగాణ యాసతో తన
పాటలు విశ్వవ్యాప్తం
గౌరవ డాక్టరేట్ అందించిన
కాకతీయ యూనివర్సిటీ..
కాళోజీ స్మారక పురస్కారం
అందుకున్న ప్రకృతి కవి
ఓ సాహిత్య గ్రంథాన్ని కోల్పోయామని జిల్లావాసుల ఆవేదన
తాపీమేసీ్త్ర నుంచి ప్రజాకవి వరకు
జీవనోపాధి కోసం తాపీమేస్త్రీగా పని చేసిన అందెశ్రీ, భవన నిర్మాణ రంగంలో చెరగని ముద్ర వేశారు. బచ్చన్నపేట మండలంలో ఆయన నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భుజానికి సంచి, అందులో తాపీ దారం– అది ఆయన సాధారణ జీవనానికి ప్రతీక. కష్టాల మధ్యే కళను పుట్టించిన ఆ కవి, తన పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. చదువులేకపోయినా ఆయన నోటి నుంచి జాలువారిన పాటలు పల్లె నుంచి పట్టణం వరకు మార్మోగాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘జై బోలో తెలంగాణ’ పాటతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన పాటల్లో కేవలం పదాలే కాదు ప్రజల బాధ, ఆశ, ఆత్మగౌరవం ప్రతిధ్వనించాయి.
నిప్పుల వాగుతో విశిష్టత
అందెశ్రీ సంపాదకత్వంలో వెలువడిన ‘నిప్పుల వాగు’ పాటల సంకలనంలో జనగామ కవుల రచనలకు విశిష్ట స్థానం కల్పించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో జనగామ కవులు జి.కృష్ణ, అయిలా సోమనర్సింహాచారి, పెట్లోజు సోమేశ్వరాచారి, చిలుమోజు సాయికిరణ్ పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. బాణాపురం అయ్యప్ప దేవాలయంలో జరిగిన సాహిత్య కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. ప్రజా సాహిత్యం, సామాజిక మార్పుపై ఆయనకున్న తపన, జనగామ కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఓరుగల్లు శోకసంద్రం


