రెండు రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు
ఉదయం జాగ్రత్తలు..రాత్రి ఉన్ని దుస్తులు
జనగామ: వాతావరణం తారుమారైపోయింది. ఇటీవలే తుపాను విరుచుకుపడి తీవ్ర నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే. తెల్లవారుజాము మబ్బులు, చల్లని గాలులతో చలి కాలం మొదలైందనిపిస్తే, మధ్యాహ్నం వరకు వేసవి కాలం తలపించే ఎండ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. కాళ్ల కింద ఎండ వేడెక్కి పోతుండగా, తలపై సూరీడు మంటలు చిమ్ముతున్నాడు. వారం రోజుల క్రితం కురిసిన వర్షం ఆవిరైపోగా, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉదయం సమయంలో వేడి పెరుగుతోంది. పగలంతా చెమటలు కక్కిస్తుంటే, రాత్రి సమయంలో గజగజ వణికించేస్తోంది.
జిల్లాలో వాతావరణం ఓ వింతగా మారిపోయింది. భారీ వర్షాలకు ప్రజలు వణికిపోగా, ఆ వర్షం ఆగిన కొద్ది గంటల్లోనే ఎండ తాకిడి మళ్లీ దంచికొడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవికాలాన్ని తలపించే విధంగా మండుతున్న ఎండ, సాయంత్రం మొదలై రాత్రి వేళల్లో చలిగా మారిపోవడం ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పగటిపూట బయటకు వెళ్లాలంటే సూర్యరశ్మి నుంచి రక్షణకు గొడుగులు, చేతి రుమాలు, తప్పనిసరిగా మారగా, రాత్రి వేళల్లో ఉన్నిదుస్తులు లేకుండా బయటికి రావడం కష్టమైపో తోంది. ఒక్క రోజులోనే ఎండా, చలి అనిపించే ఈ వాతావరణం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం సముద్రంలో ఏర్పడిన గాలి వానల ప్రభావం తగ్గడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగగా, ఉత్తర దిశల నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు.
వాతావరణంలో ఈ మార్పులు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం కేసులు ఆసుపత్రుల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువ సేపు ఎండలో తిరగకుండా ఉండటం, నీరు ఎక్కువగా తాగడం, రాత్రివేళల్లో చలినుంచి రక్షణ చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
చలికాలంలో శీతల పానీయాలు, ఐస్‌క్రీం, లస్సీకి గిరాకీ తగ్గడం లేదు. జనగామ పట్టణంలోని హన్మకొండ, సిద్దిపేట, సూర్యాపేట రోడ్డు వైపు కూల్ కూల్ దుకాణాల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పనుల్లో బిజీబిజీగా ఉంటూ, ఎండ వేడిమికి అలసిపోతున్న జనం, శీతల పానీయాలతో సేద తీరుతున్నారు. అంతే కాకుండా మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండాకాలా న్నీ తలపించే మినీ కాలం, వింతగా ఉన్నా.. మరో వైపు ప్రజలను భయపెడుతోంది.
స్వెట్టర్, మంకీ క్యాప్ ధరించిన ప్రజలు
ఎండకు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాక్టర్‌పై ప్రయాణం
రాత్రి 7 గంటలు దాటకముందే చలి పెరిగిపోతుండడంతో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, జర్కిన్లు ధరించడం ప్రజలకు తప్పనిసరి అయింది. మరోవైపు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో రోడ్లపై నడుస్తున్నవారు ముఖం, చేతులు కప్పుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం, ఎండ, చలి మూడు ఒక్కసారిగా వింత వింతగా ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాతావరణ మార్పులు ఎన్ని రోజులు కొనసాగుతాయో చెప్పడం కష్టమే. అయితే, చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణంలో వింత మార్పులు
పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం
మండలం కనిష్టం గరిష్టం
బచ్చన్నపేట 16.9 31.8
పాలకుర్తి 17.4 31.9
చిల్పూరు 18.4 31.8
దేవరుప్పుల 18.4 31.2
స్టే.ఘన్‌పూర్ 18.5 31.3
రఘునాథపల్లి 18.7 31.2
తరిగొప్పుల 18.8 31.1
నర్మెట 18.9 30.5
జనగామ 19.3 30.4
లింగాలఘణపురం 19.9 30.7
కొడకండ్ల 20.0 31.8
జఫర్‌గఢ్ 20.4 32.7
భగభగ..గజగజ
భగభగ..గజగజ
భగభగ..గజగజ
భగభగ..గజగజ
భగభగ..గజగజ


