గండేపల్లి: బతుకు దెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఆ కుటుంబాల్లో తీరని విషాదం
ఇరగవరం: కుటుంబ పోషణ కోసం కోత మిషన్ తీసుకుని కాకినాడ జిల్లా వెళ్లిన ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన డ్రైవర్ కె సింహద్రి అప్పన్న (58), రాపాక గ్రామానికి చెందిన హెల్పర్ గెడ్డం సందీప్‌లు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు విదేశాల్లో ఉండగా, మరొకరు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. రాపాక గ్రామానికి చెందిన గెడ్డం సందీప్ తండ్రి లాజర్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తల్లి సుమలత గల్ఫ్‌లో ఉంటుంది. ఒక అక్కకు వివాహం కాగా మరొకరి వివాహం కావాల్సి ఉంది.
బతుకుదెరువుకు వచ్చి కడతేరిపోయారు
బతుకుదెరువుకు వచ్చి కడతేరిపోయారు


