వైభవంగా బ్రహ్మ రథోత్సవం
హిందూపురం: గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు గోవింద శర్మ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతసేవతో మూలవిరాట్ స్వామివారికి అభిషేకాలు, పుష్ప, తులసీపత్రాలతో అర్చనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి.. ప్రాకారోత్సవం చేశారు. ప్రత్యేక హోమాల తర్వాత బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. రథాన్ని గుడ్డం చుట్టూ తిప్పి తిరిగి ఆలయ రాజగోపురం వద్దకు తీసుకొచ్చి ఉత్సవ మూర్తులకు హారతులిచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచారు. తర్వాత పార్వేట ఉత్సవం నిర్వహించారు.
రొళ్ల: మండల పరిధిలోని కొడగార్లగుట్ట గ్రామంలో వెలసిన అభయ ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ, అంకురార్పణ, హోమం, గణపతిపూజ, కలశ స్థాపన, యోగిశ్వరాధన తదితర పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారిని కొలువు దీర్చారు. అనంతరం భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. భక్తులు రథంపైకి అరటిపండ్లు, బొరుగులు, తమలపాకులు, పూలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు జ్యోతులను సమర్పించుకున్నారు.
వైభవంగా బ్రహ్మ రథోత్సవం
వైభవంగా బ్రహ్మ రథోత్సవం


