భూముల్ని లాక్కునే కుట్రలు ఆపండి
హిందూపురం: కూటమి ప్రభుత్వం కుట్రలతో రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు సేకరించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని రైతు సంఘ నాయకులు, బాధిత రైతులు హెచ్చరించారు. హిందూపురం మండలం చలివెందులలో రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం నాయకుడు రామకృష్ణరెడ్డి అధ్యక్షత హిందూపురం, చలివెందుల, రాచపల్లి, మలుగూరు, నందమూరి నగర్, సి చెర్లోపల్లి, మినుకుంటపల్లి, బాలంపల్లి, జంగాలపల్లి, కోడూరు, లేపాక్షి పరిసర ప్రాంతాల రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల పచ్చటి పంట పొలాలు లాక్కొవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల పొలాలను కారు చౌకగా లాక్కుని కంపెనీలకు కట్టబెట్టెందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. అసలు ఇష్టంలేకుండా భూములు లాక్కునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హరి, జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ 20 ఏళ్ల కిందట పరిశ్రమల కోసం మడకశిర, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం, ఓడిసి ప్రాంతాలలో వేలఎకరాలు పరిశ్రమ కోసం సేకరించిన భూములలో ఒక్క పరిశ్రమ పెట్టలేదని, ఆ భూములు తిరిగి రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేకరించిన ఆభూములలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జెడ్పి శ్రీనివాసులు, రాజప్ప, రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి, నాగిరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.


