మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి
పుట్టపర్తి అర్బన్: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర పన్నిందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జమ్మానిపల్లి నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి తిప్పన్న ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళిత నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి గాడి తప్పిందని మండిపడ్డారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. వీటిని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే వైద్య విద్యను రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తందని, అంతేకాక నాణ్యమైన ఉచిత వైద్య సేవలు ప్రజలకు దూరమవుతాయని అన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ చెల్లిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు జీతాలు చెల్లించడానికి అపసోపాలు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రాన్ని అప్పులకు తాకట్టు పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులుఅంజినప్ప, ఎస్టీడీ నరసింహులు, అంజత క్రిష్ణప్ప, కంబాలప్ప, గజ్జల శివ, కౌన్సిలర్ శేషాద్రి, పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు గరుడంపల్లి నారాయణస్వామి, మేకల నరసింహులు, సూర్యమోహన్, పెనుకొండ నాగేంద్ర, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏతేశ్వర, శంకర, ఈశ్వరయ్య, రామాంజనేయులు, చిన్నరెడ్డెప్ప, సర్పంచ్‌లు రామోదర్, కొండకమర్ల రమణ, సోమందేపల్లి నరసింహమూర్తి, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురి డిమాండ్


