జంక్షన్లలో పొంచి ఉన్న ప్రమాదాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కోడూరు వరకూ నూతనంగా ఏర్పాటు చేస్తున్న 342వ జాతీయ రహదారి పనుల్లో భాగంగా సర్వీస్ రోడ్ల జంక్షన్లు ప్రమాదకరంగా మారాయి. ఈ పనులు ఇప్పటి వరకు రెండు దశలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ సర్వీస్ రోడ్ల జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మొదటి దశలో భాగంగా ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకూ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రెండో దశలో పుట్టపర్తి మండలం బీడుపల్లి నుంచి గోరంట్ల వరకూ పనులు పూర్త చేశారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో బైపాస్‌లు ఏర్పాటయ్యాయి. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి సర్వీస్ రోడ్డుపై ప్రయాణిస్తూ జాతీయ రహదారిపైకి చేరుకునే జంక్షన్ల అభివృద్ధిని నేషనల్ హైవే అథారిటీ అధికారులు విస్మరించారు. ఇటీవల పెడపల్లి వద్ద జాతీయ రహదారిపై నుంచి సర్వీస్ రోడ్డు పై వెళ్లే క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. దీంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. మూడు నెలల క్రితం పెద్దతండా వద్ద ఉన్న జంక్షన్ వద్ద ఆటో బోల్తా పడడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటగారిపల్లి వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొన్న ఓ ద్విచక్ర వాహనదారుడి కాలు విరిగింది. కర్ణాటక బస్సు సైతం వెంకటగారిపల్లి డివైడర్‌ను ఢీ కొని నిలిచి పోయింది. గోరంట్ల మండలం మందలపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న వాహనాన్ని జంక్షన్ వద్ద ఆలస్యంగా గమనించిన ద్విచక్ర వాహన దారుడు అదుపు తప్పి బాధ్యతో పాటు కిందపడ్డాడు. ఈ ఘటనలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి జంక్షన్లను అభివృద్ధి చేసి గ్రామీణుల ఇక్కట్లు దూరం చేయాలని పలువురు కోరుతున్నారు.
జంక్షన్లలో పొంచి ఉన్న ప్రమాదాలు


