శ్మశానం కోసం పోరుబాట
పుట్టపర్తి అర్బన్: స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా.. నేటికీ ఆ గ్రామ దళితులు శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. దీంతో దళితులంగా ఏకమై నాలుగు రోజుల పాటు పాదయాత్రతో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బైఠాయించారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చిలమత్తూరు మండలం కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసులకు శ్మశాన వాటిక అంటూ ఏదీ లేదు. ఇంత కాలం ఎవరైనా చనిపోతే ఇళ్ల వద్దనే ఖననం చేస్తూ వస్తున్నారు. ఇటీవల నలుగురు చనిపోతే సమస్య తీవ్రతను గుర్తించిన దళితులు.. శ్మశాన వాటిక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు పాదయాత్రతో సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వంద మందికి పైగా దళితులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ మౌర్యభరద్వాజ్‌ను సమస్యను విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వేదిక వద్దనే బైఠాయించి, నిరసన వ్యక్తంచేశారు. ఆందోళనకు ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, బహు చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామశాస్త్రి , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మద్దతు పలికారు. సమస్యను జేసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఇప్పటికై నా దళితులకు శ్మశాన వాటిక చూపకపోతే.. ఇకపై ఎవరైనా దళితుడు మరణిస్తే.. ఆ మృతదేహాన్ని తీసుకుని కలెక్టరేట్‌కు వస్తామని హెచ్చరించారు. సమస్యకు పరిష్కారం చూపాలని గత పది రోజులుగా చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ధర్నాలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం అమానుషమన్నారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని జేసీ హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఊటుకూరు నాగరాజు, కేవీపీఎస్ రమణ, జ్యోతి, కొర్లకుంట గ్రామస్తులు లక్ష్మీపతి, నరసింహమూర్తి, గోపాలకృష్ణ, నరేంద్ర, గోపాల్, ఈశ్వర్, నంజుండప్ప, రామాంజి, నరేష్, వేణుగోపాల్, గంగాధర్, పెద్ద తిప్పన్న, చిన్న ఆదెప్ప, ఆదినారాయణ, మూర్తి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థలం చూపాలంటూ
చిలమత్తూరు మండలం
కొర్లకుంట దళితుల పాదయాత్ర
నాలుగు రోజుల అనంతరం
కలెక్టరేట్‌కు చేరిన ర్యాలీ
సమస్య పరిష్కారానికి
చొరవ తీసుకోవాలంటూ
కలెక్టరేట్‌లో బైఠాయింపు


