ప్రజా ఫిర్యాదులంటే అధికారులకు లోకువ
కదిరి అర్బన్: సమస్య పరిష్కారం కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేస్తే.. దానికి పూర్తి విరుద్ధమైన పరిష్కారాన్ని అధికారులు చూపారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు... కదిరి మండలం గొల్లొల్లచెరువు బస్టాండ్ పరిధిలోని గ్రామకంఠం స్థలాన్ని యశోదమ్మ అనే మహిళ ఆక్రమణ చేస్తోందని ముత్యాలచెరువు గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ గతంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై రెవెన్యూ అధికారి విచారణ చేపట్టి ఆ స్థలం ముత్యాలచెరువు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 598లో ఉందని, ప్రభుత్వ రికార్డుల మేరకు అది పట్టా భూమి అని పేర్కొన్నారు. అయితే ఆ స్థలానికి యశోదమ్బమ భర్త వెంకటేష్ పేరుపై గతంలో పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేశారని అనిల్‌కుమార్ గుర్తు చేశాడు. ప్రైవేట్ ల్యాండ్ అయితే పొజిషన్ సర్టిఫికెట్ ఎలా జారీచేస్తారంటూ ప్రశ్నించాడు. తహసీల్దార్ ఇచ్చిన వివరణ పత్రంలో పొజిషన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే అది వెస్ట్ గోదావరి జిల్లా వేదాంతపురం గ్రామ సర్వే నంబర్ 141–2లో కనకదుర్గ అనే మహిళ పేరిట ఉందని వివరించాడు. ప్రజా ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని, దీనిపై సత్వర కలెక్టర్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై తహసీల్దార్ మురళీకృష్ణను వివరణ కోరగా.. ఒక నంబర్ తప్పుగా పడడంతో పొరపాటు జరిగిందన్నారు. మళ్లీ కరెక్ట్ నంబర్ కొట్టి చెక్ చేయడంతో యశోదమ్మ పేరుతో పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నట్లుగా వెల్లడైందన్నారు.
వ్యవసాయ పరికరాల దొంగ అరెస్ట్
బత్తలపల్లి: వ్యవసాయ పరికరాలను అపహరించుకెళుతున్న దుండగుడిని అరెస్ట్ చేసినట్లు బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు. సోమవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన తరిగోపుల భాస్కర్ నాయుడు వ్యవసాయంతో పాటు ట్రాక్టర్ బాడుగలకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రూ.1.47 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన రోటావేటర్‌ను ట్రాక్టర్ ఇంజన్‌కు తగిలించి తన ఇంటి ఎదుట నిలిపి ఉంచిన సమయంలో దుండగులు అపహరించుకెళ్లారు. ఘటనపై భాస్కరనాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన తరిగోపుల లోకేష్ రోటావేటర్‌ను దొంగలించి సంజీవపురం గ్రామానికి చెందిన అనిల్ తోటలో దాచి, అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో ఈదుల ముష్టూరు క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రోటావేటర్‌ను స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.


