యాజమాన్య హక్కుల్లేని ఆస్తి ఎలా అమ్ముతారు..?
జగిత్యాలటౌన్: వివాదంలో ఉన్న 20గుంటల పెట్రోల్‌బంక్ స్థలాన్ని మంచాల కృష్ణ తాతలు 70ఏళ్ల క్రితం కొన్నట్లు ఎమ్మెల్యే సర్టిఫికెట్ ఎలా ఇస్తారని, ఆయన వ్యాఖ్యలు విచారణ కమిటీని ప్రభావితం చేసేలా ఉన్నాయని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కిబాల ఒరిజినల్ పత్రాన్ని మంచాల కృష్ణ ఏ కోర్టులోనూ దాఖలు చేయలేదని, యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించలేదని స్పష్టంచేశారు. ఇందిరాభవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. హైడ్రా తరహ వ్యవస్థ ఉంటే ఇప్పటికే వివాదాస్పద పెట్రోల్ బంక్‌ను కూల్చేసేదని తెలిపారు. దారం వీరమల్లయ్యకు కిబాలా ద్వారా కేటాయించినట్లు చెబుతున్నా.. ఆయన వారసులు ఏనాడూ యాజమాన్య హక్కు కోసం ఏ కోర్టునూ ఆశ్రయించలేదన్నారు. వారు ఇంజెక్షన్ ఆర్డర్ కోసం మాత్రమే ప్రయత్నించారని పేర్కొన్నారు. నిజాలు నిగ్గు తేల్చి ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ విచారణ కమిటీని నియమించారని, ఆ కమిటీని ప్రభావితం చేసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సరికాదని తెలిపారు. మంచాల కృష్ణతో కుమ్మక్కయిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, జున్ను రాజేందర్, చందా రాదాకిషన్, అల్లాల రమేశ్, సురేందర్ తదితరులు ఉన్నారు.


