హరహర మహాదేవ
పెరవలి: అన్నవరప్పాడు శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పటిక లింగాన్ని నాలుగో రోజైన ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. కార్తిక మాసంలో పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర కావడంతో తండోపతండాలుగా భక్తులు వచ్చారు. ఓవైపు ఎండ దంచేస్తున్నా.. ఆలయం నుంచి జాతీయ రహదారిపై సైతం సుమారు అర కిలోమీటరు మేర బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో, హైవేపై వన్‌వే అమలు చేశారు. స్ఫటిక లింగ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్థానిక సిబ్బందితో పాటు రాజమహేంద్రవరం నుంచి సైతం సిబ్బంది వచ్చి, భక్తులకు సేవలు అందించారు. భక్తులకు బొలిశెట్టి రామకృష్ణ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. స్వామి వారి ప్రసాదాన్ని 10 వేల మంది స్వీకరించారని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం స్వామివారికి కల్యాణం నిర్వహించిన అనంతరం, పరిణయ ప్రసూనార్చిత వసంతోత్సవం జరుగుతుందని తెలిపారు. దేశంలో అరుణాచలంలో మాత్రమే నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అరుణాచలం ఆలయ అర్చకుడు అరసు ఆచారి బాలాజీ వచ్చారని ఆలయ పురోహితుడు ఫణిశర్మ తెలిపారు.


