ఆయిల్‌పామ్‌కు ‘సహకారం’ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌కు ‘సహకారం’

Nov 10 2025 8:04 AM | Updated on Nov 10 2025 8:04 AM

ఆయిల్

ఆయిల్‌పామ్‌కు ‘సహకారం’

● పీఏసీఎస్‌ల భాగస్వామ్యంతో సాగు విస్తీర్ణం పెంపు.. ● ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు లక్ష్యం

లక్ష్మణచాంద: అన్నదాతలకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటల సాగును కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం వచ్చే ఈ పంటపై రైతుల్లో ఇంకా సరైన అవగాహన లేకపోవడంతో సాగు ఆశించిన స్థాయిలో జరగలేదు. వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలను(పీఏసీఎస్‌) భాగస్వామ్యంతో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల పీఏసీఎస్‌ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు.

ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు..

ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా సహకార అధికారి నర్సయ్య తెలిపారు. సొసైటీలో సభ్యులైన రైతులతో సమావేశాలు నిర్వహించి పంట లాభాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 40 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సంఘం తమ పరిధిలో లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో ప్రగతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో 8,786 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 3,092 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 2,505 ఎకరాలు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,187 ఎకరాల్లో సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో 15,570 ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ధర రూ.193 ఉండగా, సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుంది. ఎకరంలో సగటుగా 50–55 మొక్కలు నాటేందుకు అవసరమైన రూ.10,615 విలువైన మొక్కలను కేవలం రూ.1,100లకే రైతులకు అందిస్తోంది. అలాగే బిందు సేద్యం పరికరాలను రాయితీతో అందిస్తూ, ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అదనంగా పవర్‌ టిల్లర్లు, బ్రష్‌ కట్టర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, బీసీ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు.

లక్ష్యం పూర్తికి చర్యలు

ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక్కో పీఏసీఎస్‌కు నిర్దేషించిన లక్ష్యం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేరేందుకు త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించి, లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం.

– నర్సయ్య, జిల్లా సహకార అధికారి,

నిర్మల్‌ జిల్లా

సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రాథమిక సహకార సంఘాల సమన్వయంతో సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు చేపడతాం. రైతులను ప్రోత్సహిస్తాం.

– బీవీ రమణ,

జిల్లా హార్టికల్చర్‌ అధికారి, నిర్మల్‌

ఆయిల్‌పామ్‌కు ‘సహకారం’1
1/1

ఆయిల్‌పామ్‌కు ‘సహకారం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement