ధర్మవరం అర్బన్: తాగుడు మానేయమని చెప్పినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన మేరకు.. ధర్మవరంలోని లోనికోట ప్రాంతానికి చెందిన శివ (36)కు భార్య నవనీత, ఓ కుమారుడు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల తాగుడుకు బానిసై, ఇంటి బాగోగులు పట్టించుకోవడం మానేశాడు. దీంతో తాగుడు మానేయాలని తరచూ భార్య చెబుతూ వచ్చేది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం కూడా భార్య నచ్చచెప్పే ప్రయత్నం చేయడంతో క్షణికావేశానికి లోనైన శివ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శివ మృతి చెంనట్లు నిర్ధారించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
మడకశిర రూరల్: మండలంలోని మణూరు గ్రామానికి చెందిన కదురప్ప (45) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బెంగళూరులో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఓ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న అతను ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. శస్త్రచికిత్స అనంతరం ప్రాణాలు దక్కాయి కానీ, మతిస్థిమితం లేక తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేవాడు. ఈ నెల 4న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను సాయంత్రమైన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం స్థానికులు గ్రామ సమీపంలోని పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని విగత జీవిగా వేలాడుతున్న కదురప్పను గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
బాధితుడికి దుద్దుకుంట పరామర్శ
పుట్టపర్తి టౌన్: టీడీపీ గూండాల దాడిలో గాయపడిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేత, బిల్డర్ మల్లికార్జునను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ఆదివారం పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్య్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం మానేయమంటే.. ప్రాణం తీసుకున్నాడు!


