పేకాటకు అడ్డాగా నూజివీడు | - | Sakshi
Sakshi News home page

పేకాటకు అడ్డాగా నూజివీడు

Nov 10 2025 8:10 AM | Updated on Nov 10 2025 8:10 AM

పేకాటకు అడ్డాగా నూజివీడు

పేకాటకు అడ్డాగా నూజివీడు

పేకాటకు అడ్డాగా నూజివీడు నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతాలే అడ్డా

పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

నూజివీడు సర్కిల్‌ పరిధిలో ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అనుమతి లేదు. ఎవరైనా పేకాట గానీ కోడిపందాలు, ఎలాంటి సంఘవిద్రోహ కార్యక్రమాలు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. నియోజకవర్గంలో ఎక్కడైనా కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

–కొప్పిశెట్టి రామకృష్ణ, నూజివీడు సీఐ

నూజివీడు: మామిడికి ప్రసిద్ధిగాంచిన నూజివీడు నియోజకవర్గం ప్రస్తుతం పేకాటకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి జూదాలను విచ్చలవిడిగా ప్రోత్సహించడం పరిపాటిగా మారిందనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో మామిడి తోటలు, అటవీ ప్రాంతం పేకాటకు అడ్డాగా మారాయి. అధికార పార్టీ నాయకులు పేకాట శిబిరాలను నిర్వహిస్తూ పేకాటనే సంపాదన మార్గంగా మలుచుకొంటున్నారు. పేకాటకు తోడు కోడిపందేలు సైతం అక్కడక్కడా ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. పేకాటకు సంబంధించి ఇటీవల నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడి అనుచరుడికి, పేకాట నిర్వాహకుడికి మధ్య జరిగిన సంబాషణ ఆడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ అనుచరుడు పోలీసులు దాడి చేయడానికి వచ్చే సమాచారం తనకు ముందుగానే అందుతుందని, నాకు రెండు ఫోన్‌ నెంబర్లు ఇస్తే వాటికి ఫోన్‌చేసి చెప్తానని, పేకాట శిబిరం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో లొకేషన్‌ షేర్‌ చేయాలని ఆ సంభాషణలో పేర్కొన్నాడు.

దేవరగుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో నూజివీడు, ముసునూరు మండలాల సరిహద్దులో ఏర్పాటు చేసుకోండంటూ సలహా కూడా ఇచ్చాడు. పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మామిడి తోటల్లో పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి ఎంట్రీ ఫీజు రూ.5 వేలు పెట్టగా ప్రతిరోజూ ఈ శిబిరానికి 25 నుంచి 30 మంది వస్తున్నారు. రెండు రోజులకోసారి ప్లేస్‌లు మారుస్తూ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. నూజివీడు మండలంలోని సుంకొల్లుకు చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు యనమదల నుంచి మైలవరం మండలం పోరాటనగర్‌కు వెళ్లే మార్గంలో అడవిలోని కొండల ప్రాంతంలో కొన్ని నెలలుగా యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక్కడకు నూజివీడు, మైలవరం, జీ కొండూరు, ఏ కొండూరు ప్రాంతాల నుంచి జూదగాళ్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడి పోలీసులు కాకుండా మైలవరం పోలీసులు ఈనెల 6న పేకాట శిబిరంపై మెరుపు దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.లక్షకు పైగా నగదును, 49 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి చేసిన సమయంలో శిబిరాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి తాను మంత్రి మనిషినని, మంత్రి దృష్టికి తీసుకెళ్తానని మైలవరం పోలీసులను బెదిరించినా పోలీసులు ఏమాత్రం తలొగ్గకుండా స్టేషన్‌కు తరలించి కేసు కట్టారు.

నూజివీడు మండలంలోని మిట్టగూడెం, నూజివీడు పట్టణం, తుక్కులూరు, ముక్కొల్లుపాడు, ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో, ఆగిరిపల్లి మండలంలో ఈదర, కొత్త ఈదర, కనసానపల్లి, ఆగిరిపల్లి, గన్నవరం మండలాల సరిహద్దుల్లో పేకాట శిబిరాలు సాగుతున్నాయి. చాట్రాయి మండలం పోలవరంలో ఇటీవల వరకు పేకాట శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే పోలీసులకు తెలియడంతో ఈ శిబిరాన్ని నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement