వైద్య విద్యార్థులకు ఎలుకల బెడద | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థులకు ఎలుకల బెడద

Nov 10 2025 7:50 AM | Updated on Nov 10 2025 7:50 AM

వైద్య

వైద్య విద్యార్థులకు ఎలుకల బెడద

వసతులపై ఆరా

షోకాజ్‌ నోటీసు, మెమో

ఏలూరు టౌన్‌: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతిష్టను మంటకలిపేలా అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఏలూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటు చేయగా తాజాగా ఆరుగురు విద్యార్థులపై ఎలుకల దాడి ఆందోళనకు గురిచేస్తోంది. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు సరైన వసతి కల్పించటంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఆఖరికి కాంట్రాక్టర్‌తో సైతం పనులు చేయించుకోలేని దుస్థితిలో అధికారులు ఉండటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఏలూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఆందోళనలో విద్యార్థులు

ఏలూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో ఎంసీహెచ్‌ భవనంపై అంతస్తులో 2023 సెప్టెంబర్‌ 15నాటికి ఫస్టియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటుచేశారు. ఒకవైపు బాలికలకు, మరోవైపు బాలురకు వేర్వేరుగా హాస్టల్‌ వసతి కల్పించారు. రెండో ఏడాది ఇదే చోట వసతి కల్పించగా.. తాజాగా మూడో ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు మాత్రం కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్‌ భవనంలో వసతి ఏర్పా ట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎంసీహెచ్‌ భవనంపై అంతస్తులో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆరుగురిని ఎలుకలు కరవగా, వారంతా జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ విభాగంలో ఏఆర్‌వీ ఇంజెక్షన్లు చేయించుకున్నట్టు చెబుతున్నారు.

కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యం

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భారీగా నిధులు చెల్లిస్తున్నా పనులు మాత్రం లేవనే ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ హాస్టల్స్‌లోనూ ఎలుకలు, పిల్లులు, చెదలు, పాములు ఇలాంటి వాటి నివారణకు ప్రత్యేకంగా సాయి పెస్ట్‌ కంట్రోల్‌ సర్వీసెస్‌కు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. నెలకు సుమారు రూ.4.68 లక్షల వరకూ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. అయితే కాంట్రాక్టర్‌ పనులేమీ చేయకుండా జేబులు నింపుకుంటున్నాడనీ, అధికారులు సైతం ఏం మాట్లాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్‌ నలుగురు సిబ్బందిని నియమించినా వారు కూడా విధుల్లో కనిపించరని అంటున్నారు. జోన్‌–2 పరిధిలో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని జీజీహెచ్‌లు, మెడికల్‌ కాలేజీలు, సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటళ్లలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్ట్‌ అతనిదేనని చెబుతున్నారు.

గతంలో శవాలను వదల్లేదు

ఏలూరు జీజీహెచ్‌ మార్చురీలో గతంలో శవాలనూ ఎలుకలు వదల్లేదు. మార్చురీలోని మృతదేహాల ముక్కులు, చెవులను ఎలుకలు కొరుక్కుతిన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది అప్పట్లో సంచలనం అయ్యింది. అలాగే ఏలూరు సర్వజన ఆస్పత్రిలోనూ రోగులకు ఎలుకల బెడద ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

హాస్టల్‌ విద్యార్థులపై దాడి

ఆరుగురు విద్యార్థులను కరిచిన వైనం

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య వైఖరి

వైద్యారోగ్య శాఖ మంత్రి ఆగ్రహం

గతంలో మార్చురీలో శవాలనూ ఎలుకలు కొరికిన సంఘటనలు

ఎంసీహెచ్‌ భవనంపై అంతస్తులోని హాస్టల్‌ను మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సావిత్రి ఆదివారం పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థిను లను ఆరా తీశారు. ఎలుకలు కరిచిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎలుకల కోసం సిబ్బందితో బోనులు ఏర్పాటు చేయించారు. కొన్నిచోట్ల కిటికీలు, తలుపులకు రంధ్రాలు ఉండటంతో వాటిని మూయించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కా కుండా పటిష్ట చర్యలు తీసుకుంటామనీ, ఆందోళనకు గురికావద్దని భరోసా కల్పించారు. కాంట్రాక్టర్‌తో గతంలో ర్యాట్‌మ్యాట్‌లు పెట్టించటంతోపాటు, స్ప్రే చేయించామనీ, ఎలుకల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టేలా కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. హాస్టల్‌లో పరిస్థితులపై వైద్య విద్యార్థులు, వార్డెన్స్‌తోనూ మాట్లాడతామనీ, విచారణ అనంతరం చర్యలు చేపడతామని చెప్పారు.

వైద్య విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, ని ర్వహణ సంస్థ, హాస్టల్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు డీఎంఈ రఘునందన్‌ పెస్ట్‌ కంట్రోల్‌ సర్వీసెస్‌ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వార్డెన్‌కు మెమో ఇవ్వాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సావిత్రిని ఆదేశించారు. వెంటనే వైద్య విద్యార్థుల వసతి గృహాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలన్నారు.

వైద్య విద్యార్థులకు ఎలుకల బెడద1
1/1

వైద్య విద్యార్థులకు ఎలుకల బెడద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement