‘సూర్యలంక’కు సందర్శకుల కళ
● తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు
● పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
● భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
బాపట్ల టౌన్: పర్యాటకులతో సూర్యలంక సముద్ర తీరం ఆదివారం కళకళలాడింది. కార్తిక మాసం ప్రారంభం నుంచి పౌర్ణమి వరకు బీచ్ మూసివేసి ఉండటం, పౌర్ణమి తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తీరానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బాపట్ల–సూర్యలంక రహదారి రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరంలో సందడి నెలకొంది. సూర్యోదయంతో కూడిన పుణ్యస్నానాలాచరించేందుకు భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే వచ్చారు. యువత సరదాగా గడిపారు. కొందరు తీరం వెంబడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమ, శివలింగాలను తయారుచేసి వాటి ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. స్వామి వారి శివలింగాన్ని పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజలనంతరం గౌరీదేవి ప్రతిమలతోపాటు గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లను సముద్రంలో కలిపిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
పోలీసుల సూచనలు పాటించాలి
సూర్యలంక తీర ప్రాంతం మొత్తం నిఘా నేత్రంలో ఉందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం తీరాన్ని ఆయన సందర్శించారు. భద్రతా చర్యలు, సిబ్బంది విధులు, పర్యాటకుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. తీరం వెంబడి 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మద్యం తాగి సముద్రంలోకి దిగడం, ఈత కొట్టడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయని, పోలీస్ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గస్తీ కోసం 10 పడవలను సిద్ధం చేశామని చెప్పారు. ఎరుపు జెండాలు దాటి ఎవరూ కూడా లోపలికి వెళ్లవద్దన్నారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, బాపట్ల రూరల్ సీఐ ఎం.శ్రీనివాసులు, చీరాల రూరల్ సీఐ పి.శేషగిరి, మైరెన్ పోలీస్ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘సూర్యలంక’కు సందర్శకుల కళ
‘సూర్యలంక’కు సందర్శకుల కళ


