రచయిత నసీర్ అహమ్మద్‌కు జీవిత సాఫల్య పురస్కారం
లక్ష్మీపురం: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారానికి ప్రముఖ చరిత్రకారుడు, రచయిత సయ్యద్ నసీర్ అహమ్మద్ ఎంపికయ్యారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ గౌస్ పీర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న నసీర్ 25 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వెలువరించారు. ఈ గ్రంథాలు ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, గుజరాతీ భాషలలో వెలువడ్డాయి. నసీర్ అహమ్మద్ కేవలం చరిత్ర గ్రంథ రచన, ప్రచురణతో కాకుండా సమరయోధుల త్యాగమయ, సాహసోపేత పోరాటాలను యువత, విద్యార్థులకు తెలియజేస్తూ పలు ప్రచార కార్యక్రమాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసీర్ అహమ్మద్ తన కుటుంబం, సన్నిహితుల ఆర్థిక సహకారంతో ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందల గ్రంథాలయాలకు, చరిత్రకారులకు, జర్నలిస్టులకు అందిస్తున్నారు. ఈ గ్రంథాల పీడీఎఫ్ ఫైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి కోరిన వారికి అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నింటినీ అందుబాటులో ఉంచారు. మూడు దశాబ్దాలుగా సయ్యద్ నసీర్ అహమ్మద్ అవిశ్రాంతంగా సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ ఈ ఏడాదికిగాను ప్రతిష్టాత్మక ‘జీవిత సాఫల్య‘ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికతో నసీర్ అహమ్మద్‌ను విజయవాడలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు సత్కరించనున్నారు.


