పెన్షనర్ల సంక్షేమంపై ఉదాసీనత వీడాలి
హన్మకొండ: పెన్షనర్ల సంక్షేమం, వారి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనత వీడాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో తెలంగాణలో మినహా ఏ రాష్ట్రం కూడా ఐదు డీఏలు ఇవ్వకుండా లేదని విమర్శించారు. పీఆర్‌సీ ప్రకటించకుండా తీవ్ర కాలయాపన చేస్తోందని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు అనుమతించాలని, ఐదు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో అసోసియేషన్‌కు సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అసోసియేషన్ వరంగల్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కె.గోపాల్‌రెడ్డి, పరిశీలకుడిగా తిరువరంగం ప్రభాకర్ వ్యవహరించారు. వరంగల్ అధ్యక్షుడిగా శ్రీపాద సోమయ్య, సహ అధ్యక్షుడిగా కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా వరయోగుల సురేశ్, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, మధుసూదన్, జి.బాల, కార్యదర్శులుగా పి.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటరాములు, కోశాధికారిగా రమేశ్, సంయుక్త కార్యదర్శులుగా కేదారి, రామ్మోహనాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కుమారస్వామి, రాంభద్రయ్య, లలిత, పబ్లిసిటీ సెక్రటరీగా యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్లుగా లక్ష్మారెడ్డి, ఈశ్వరమూర్తి ఎన్నికయ్యారు.
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్
అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్


