కుక్కలున్నాయ్.. జాగ్రత్త!
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏకంగా ఆలయ ఆవరణలో సంచరిస్తూ.. భక్తులను హడలెత్తిస్తున్నాయి. గతంలో ఆలయ అధికారులు వీధి శునకాలను పట్టించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేలా చర్యలు చేపట్టేవారు. కొన్నాళ్లుగా వీధి కుక్కల నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆలయ పరిసరాల్లో వాటి సంచారం అధికమైంది. ఘాట్ రోడ్లలో, కొండపైన పార్కింగ్ ప్రదేశాల్లో, షాపింగ్ కాంప్లెక్స్, అనివేటి మండపం వద్ద, తూర్పు రాజగోపుర ప్రాంతంలో శునకాల బెడద ఎక్కువగా ఉంది. భక్తుల మద్యలోంచి సంచరించడం, దారుల్లో పడుకోవడం వంటి వాటివల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో అవి దాడి చేస్తాయోనని భీతిల్లుతున్నారు. శునకాలను పట్టించి, అటవీ ప్రాంతాలకు తరలిస్తుంటే జంతు ప్రేమికులు తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, అందువల్ల ఏమీ చేయలేకపోతున్నామని దేవస్థానం ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తారా..
వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో తాజాగా సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో సంచలన ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల ప్రాంగణాల్లో వీధి కుక్కలను పూర్తిగా లేకుండా చేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ పరిసరాలు సున్నితమైన ప్రాంతాలే కాబట్టి వీధి కుక్కల నిర్మూలనకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టొచ్చు. అయితే ఇక్కడి అధికారులు స్పందిస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
శ్రీవారి ఆలయ ఆవరణలో వీధి కుక్కల స్వైరవిహారం
వాటిని పట్టించేందుకు ఇంతవరకూ వెనకడుగు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందడుగు వేసేనా..
కుక్కలున్నాయ్.. జాగ్రత్త!
కుక్కలున్నాయ్.. జాగ్రత్త!


