మీటర్ రీడింగ్ టెండర్లలో గోల్‌మాల్!
పలు అనుమానాలు
ఆందోళనలో 450 మంది రీడర్లు
భీమవరం(ప్రకాశం చౌక్): యువగళంలో పనిచేసిన వారికి, తమ విధేయులుగా ఉన్నవారికి విద్యుత్ స్పాట్ మీటర్ రీడింగ్ కాంట్రాక్టులు అప్పగించేందుకు తెలుగుదేశం నాయకులు తెరదీశారు. దీంతో 20 ఏళ్లుగా ఉన్న సుమారు 450 మంది ఉపాధికి గండి పడనుందని మీటర్ రీడర్లు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని వారి ద్వారా డివిజన్ స్థాయిలోని సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు ఆదేశాలు జారీ చేయించి తమ అనుయాయులకే టెండర్లు దక్కేలా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని పాత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మీటర్ రీడింగ్ లో పూర్తిస్థాయిలో వారి అనుచరులు ఉండాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారని, విద్యుత్ శాఖ అధికారులు కూడా వారికి వంత పాడుతున్నారని అంటున్నారు.
నిబంధనలు కాలరాసి..
సాధారణంగా ప్రభుత్వ పనులు, సర్వీసులకు సంబంధించిన టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికి టెండర్లు ఖరారు చేస్తారు. అయితే మీటర్ రీడింగ్ టెండర్లలో మాత్రం ఎక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్లు ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిసింది. పాత కాంట్రాక్టర్లు తక్కువ ధరకు టెండర్లు వేయగా టీడీపీ నేతల ఆశీస్సులతో ఎక్కువ ధరకు టెండర్లు వేసిన వారికి ఖరారు కానున్నట్టు కొందరు పాత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అదే జరిగితే టెండర్ నిబంధనలను విద్యుత్ శాఖ అధికారులు కాలరాసినట్టేనని అంటున్నారు.
భీమవరం సర్కిల్‌లో ఆలస్యం
భీమవరం సర్కిల్ పరిధిలో తాడేపల్లిగూడెం, భీ మవరం, నరసాపురం డివిజన్లు, 9 సబ్ డివిజన్లు (తాడేపల్లిగూడెం టౌన్, పాలకొల్లు టౌన్, ఆచంట, తణుకు, భీమవరం టౌన్, పాలకొడేరు, గణపవరం, ఆకివీడు, నరసాపురం టౌన్) ఉన్నాయి. మొత్తం 20 లక్షల సర్వీసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31తో మీటర్ రీడింగ్ రెండేళ్ల కాంట్రాక్ట్ సమయం ముగిసింది. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకు కొత్త టెండర్లు పిలవలేదు. దాంతో పాత కాంట్రాక్టర్లు ఒక కాంట్రాక్ట్‌కు నెలకి రూ.30 వేల చొప్పున రూ.1.50 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇప్పటివరకూ చెల్లించారు. ఈ సొమ్ము ఏడాది తర్వాత గానీ తిరిగి రాదు. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లో ఒకసారి టెండర్లు ప్రక్రియ పూర్తికాగా ఎటువంటి కారణాలు తెలపకుండా రద్దు చేశారు. మళ్లీ అక్టోబరు మొదటి వారంలో టెండర్లు పిలిచా రు. టెండర్లు వేసి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఎస్‌ఏఓ, డీఈ టెక్నికల్, డీఈ ఆపరేషన్ కమిటీ పరిశీలన చేసినా ఇప్పటికీ భీమవరం సర్కిల్ ఎస్‌ఈ అదేశాలు ఇవ్వలేదు. ఇతర సర్కిళ్లలో టెండర్లు వేసిన 10 రోజులకే వాటిని ఖరారు చేశారు.
ఖరారు కాకుంటే బిల్లింగ్‌కు నిరాకరణ
టెండర్లు ఖరారు కాకుంటే డిసెంబర్ 1 నుంచి బిల్లింగ్‌కు నిరాకరించేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఒక్కో కాంట్రాక్టర్ సబ్ డివిజన్‌కు రూ.5 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించామని, తమ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని టెండర్లను పారదర్శకంగా ఖరారు చేయాలని కోరుతున్నారు.
టెండర్లు ఖరారు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. కూటమి నాయకుల సిఫార్సుతో టెండర్లు వేసిన వారికి కాంట్రాక్ట్ అప్పగించడం, ఇప్పటికే కమిటీకి ఎవరు టెండరు ఎంతకు వేశారో తెలియడంతో కాంట్రాక్టర్ల నుంచి ‘మామూళ్ల’ బేరం కుదరకపోవడం వంటి కారణాలతో ఆలస్యమవుతున్నట్టు ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు ఆలస్యం చేయడంతో పాత కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్ భారంగా మారింది.
‘పచ్చ’పాతం
అధికార పార్టీ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు
ఆందోళనలో పాత కాంట్రాక్టర్లు
భీమవరం సర్కిల్‌లో ఖరారు కాని టెండర్లు
మార్చి 31తో ముగిసిన కాంట్రాక్ట్ గడువు
450 మంది మీటర్ రీడర్ల ఉపాధికి ముప్పు
భీమవరం సర్కిల్‌లో 20 మంది పాత కాంట్రాక్టర్ల పరిధిలో 450 మంది స్పాట్ రీడర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.18 వేల జీతం అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మీటర్ రీడింగ్ కాంట్రాక్ట్‌లపై టీడీపీ నాయకుల కళ్లు పడ్డాయి. ఏదోరకంగా కాంట్రాక్ట్‌లను దక్కించుకుని, తమ వారిని మీటర్ రీడర్లుగా పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే 20 ఏళ్లుగా ఇదే పనిని నమ్ముకున్న తాము రోడ్డున పడతామని మీటర్ రీడర్లు ఆందోళన చెందుతున్నారు. చివరకు స్పాట్ మీటర్ రీడర్ పోస్టులను అమ్ముకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.


