నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు
● బయటనుంచి కొనుగోలు చేస్తున్న వైనం
● ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రజలకు సక్రమంగా అందే పరిస్థితి కానరావటం లేదు. బోధనాసుపత్రిగా మారిన అనంతరం అత్యాధునిక వైద్యసేవలు అందిస్తారని ప్రజలు ఆశపడగా.. కూటమి సర్కారు హయాంలో పేదలకు వైద్యసేవలు దూరమయ్యాయి. ఇక మరోవైపు జీజీహెచ్‌లో ఆక్సిజన్ తయారీ ప్లాంట్స్ ఉండగా.. బయటనుంచి ఆక్సిజన్ సరఫరా కావడం గమనార్హం. కరోనా విలయం సృష్టిస్తోన్న తరుణంలో గత ప్రభుత్వం ఆక్సిజన్ బయట నుంచి సరఫరా కంటే లోపలే తయారీ ప్లాంట్స్ ఏర్పాటు చేయటం మేలనే ఆలోచనతో ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. మెల్లగా ఆక్సిజన్ ప్లాంట్స్‌ను బూజుపట్టేలా చేస్తూ.. బయట కొనుగోలు చేయటం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో అధికారులు విఫలం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్స్?
కరోనా విపత్కర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లో యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ తయారీ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. సర్వజన ఆసుపత్రిలోని సుమారు 400 బెడ్లకు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి హాస్పిటల్ సూపరింటిండెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేంద్రం నిధులు రూ.కోటి వ్యయంతో భారీగా వెయ్యి ఎల్‌పీఎం ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఠాగూర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరో చిన్నపాటి 250 ఎల్‌పీఎం ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంలో తమ సహకారాన్ని అందించారు. ఎంతో వ్యయప్రయాసలతో ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌లు అప్పట్లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు నిర్మించారు. నేడు ఆక్సిజన్ తయారీ ప్లాంట్స్ నిరుపయోగంగా ఉన్నాయి.
బయటనుంచి సరఫరా
ఆసుపత్రిలో ప్రస్తుతం అసలు ఆక్సిజన్ బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలియని దుస్థితి నెలకొంది. గతంలో ఎమర్జెన్సీ విభాగంలోనే మూడు వార్డుల్లో అత్యవసర కేసులకు చికిత్స అందించేలా ఆక్సిజన్ సరఫరా, ఏసీ గదులు ఉండేవి. ఒక్కో రూమ్‌లో కనీసం 20 మంది రోగులకు వైద్య సేవలు అందించేవారు. జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులతోపాటు, ఎంసీహెచ్ బ్లాక్‌లోని అత్యవసర విబాగాలకు ఆక్సిజన్ సరఫరా పైప్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కంటివైద్య విభాగం వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వ చేసే ట్యాంక్‌లో బయట నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. నెలకు కనీసం రూ.2 లక్షల వరకూ ఆక్సిజన్‌కు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను నిరుపయోగంగా వదిలేసి.. బయట నుంచి డబ్బులు చెల్లించి తెచ్చుకోవటం దేనికంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు


