స్విమ్మింగ్ పోటీల్లో పోలీసులకు పతకాలు
భీమవరం: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా పోలీసులు పతకాలు సాధించారు. మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరులో గత నెల 11, 12 తేదీల్లో జరిగిన 7వ నేషనల్ మాస్టర్స్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్ పి.సత్యనారాయణ 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సాధించారు. అలాగే కానిస్టేబుల్ డి.అనిల్ కుమార్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ వంటి మూడు వేర్వేరు స్విమ్మింగ్ విభాగాల్లో తృతీయ స్థానాన్ని దక్కించుకొని మూడు బ్రాంజ్ మెడల్స్‌ను గెలుచుకున్నారు. పతకాలు సాధించిన కానిస్టేబుళ్లను ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ ప్రత్యేకంగా అభినందించారు.
ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ సాధించింది. విశాఖపట్టణంలో ఈ నెల 7వ తేదీ నుంచి 10 వరకూ 11వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి మహిళల జట్టు జయకేతనం ఎగరేసింది. వరుస విజయాలతో విజేతగా నిలిచింది. పోటీల ప్రారంభ రోజు జరిగిన లీగ్ దశలో శ్రీకాకుళం జట్టుపై 45–19, అనంతపురం జట్టుపై 49–15 స్కోర్‌తో విజయం సాధించింది. రెండో రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో గుంటూరు జట్టును 44–22 స్కోర్‌తో ఓడించి సెమీఫైనల్‌లో ప్రవేశించింది. బలమైన తూర్పుగోదావరి జట్టును సైతం సెమిస్‌లో 50–45 స్కోర్‌తో ఓడించి ఫైనల్‌కు చేరింది. సోమవారం సాయంత్రం ఆతిథ్య జట్టు విశాఖపట్టణంతో జిల్లా జట్టు హోరాహోరీగా తలపడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో జిల్లా మహిళలు అద్బుత ప్రతిభ చాటారు. ఆఖరి నిమిషాల్లో పాయింట్లు సాధించి 54–52 స్కోర్‌తో విజేతగా నిలిచారు. కోచ్ కె మురళీకృష్ణ జట్టుకు మార్గదర్శకుడిగా నిలిచారు. మరోపక్క జిల్లా పురుషుల జట్టు నాల్గొవ స్థానంలో నిలిచింది.
స్విమ్మింగ్ పోటీల్లో పోలీసులకు పతకాలు


