కార్తీకం.. పోటెత్తిన భక్తజనం
● హర నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
● పంచారామాలను దర్శించుకున్న భక్తులు
పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామరామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి భక్తులు, మహిళలు కాలువలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, ఆలయం వెనుకభాగం, అభిషేకాల మండపం భక్తులతో నిండిపోయాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి పంచారామ యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. శ్రీ క్షీరారామలింగేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు పాలు పంపిణీ చేయగా పట్టణ తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. దాత బాలి ఏడుకొండలు భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఉమాసోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పంచారామక్షేత్రం శ్రీఉమాసోమేశ్వరజనార్థన స్వామి దేవస్థానం శివనామస్మరణతో మార్మోగింది. పంచారామక్షేత్రాల యాత్రికులు, జిల్లా నలమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి మహన్యాస పూర్వక రుధ్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్విరామంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి లక్షపత్రి పూజ జరిపారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పట్టణంలోని మరో శివక్షేత్రమైన శ్రీభీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కార్తీకం.. పోటెత్తిన భక్తజనం
కార్తీకం.. పోటెత్తిన భక్తజనం
కార్తీకం.. పోటెత్తిన భక్తజనం
కార్తీకం.. పోటెత్తిన భక్తజనం


