పట్టిసం శివ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
పోలవరం రూరల్: పోలవరం మండలంలోని పట్టిసం శివక్షేత్రం భక్తులతో పోటెత్తింది. అధిక సంఖ్యలో భక్తులు శివక్షేత్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. పలువురు భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి క్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్రపాలకుడైన భావన నారాయణ స్వామిని కూడా దర్శించుకుని సాలిగ్రామ దానం నిర్వహించుకున్నారు. వీరేశ్వరస్వామి ఆలయంలోని ధ్వజస్ధంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందించారు. భక్తులు నది దాటేందుకు రెండు లాంచీలను ఏర్పాటు చేశారు. పోలవరం ఎస్సై ఎస్‌ఎస్‌పవన్ కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించగా క్షేత్రం వద్ద దేవస్థానం ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు.


