తొమ్మిది మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్ర హాస్పిటల్స్‌లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 2 నుంచి 8 వరకూ నిర్వహించిన శిబిరంలో 9 మందికి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో స్పెయిన్‌కు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బోస్కో మోస్కోసోతో పాటు పిడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్‌లు, డాక్టర్ ఫిలిప్, డాక్టర్ ఐతోర్ లోపెజ్, నటాలియా సొరొళ్ల, లారా పాల్గొని చిన్నారులకు సర్జరీలు చేశారని తెలిపారు. రిప్లేస్ మెంట్ ఆఫ్ మైట్రల్ వాల్వ్, సూడో ఎన్యూరిసం, డీఓఆర్వీ + టెట్రాలజి ఆఫ్ ఫాలో వంటి అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న తొమ్మిది మందికి విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు డాక్టర్ రామారావు తెలిపారు. సమావేశంలో పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్, డాక్టర్ నాగేశ్వరరావులతో పాటు కార్డియాక్ ఎనస్థిస్ట్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.
మంత్రి పార్థసారథి ఎస్కార్ట్ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి
గుడివాడరూరల్/కోనేరుసెంటర్: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఎస్కార్ట్ ఎస్‌ఐ ఆర్.ఎస్.రంగనాథరావు(60) ఆదివారం గుడివాడలో గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి పార్థసారథి మచిలీపట్నం నుంచి నూజివీడు వెళ్తుండగా ఎస్కార్ట్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రంగనాథరావు ప్రయాణంలో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఆయనను సిబ్బంది తరలించగా వైద్యులు వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. ఆయన స్వగ్రామం అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం. ఎస్‌ఐ రంగనాథరావుకు గతంలో ఓ సారి హార్ట్‌సర్జరీ జరిగిందని సిబ్బంది తెలిపారు. రంగనాథరావు మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి ఎస్‌ఐగా పని చేస్తూ మంత్రి ఎస్కార్ట్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ఐ మృతి చెందారన్న సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎస్‌ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, డీఎస్పీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
తొమ్మిది మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు


