గిరాకీ ఉంది.. ప్రోత్సాహమే లేదు!
ఈ ఏడాది వ్యాధులతో మృత్యువాత పడిన నాటుకోళ్లు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైన వైనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని సైతం పక్కదారి పట్టించిన పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో 2వేల నాటుకోళ్ల సామర్థ్యంతో 8ఫారాలు మాత్రమే నిర్వహణ
నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపని రైతులు
జి.కొండూరు: నాటుకోడి కూరకు మాంసాహార ప్రియుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. విభిన్న రుచితో పాటు ఆరోగ్య దాయకం కావడంతో అంతా దానిని ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం ఆ నాటుకోడి కొండెక్కింది. ఇటీవల వచ్చిన వ్యాధుల ప్రభావంతో కోళ్లు భారీగా మృత్యువాత పడి.. కొరత ఏర్పడడంతో ధర ఆకాశాన్నంటుతోంది. మటన్ ధరను దాటి నాటుకోడి ధర పలుకుతుందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి రాయితీలు అందించకపోగా.. కోళ్ల షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందించిన రాయితీని సైతం నిర్లక్ష్యం చేసి అధిక రాయితీ ఉన్న పశువుల షెడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ తమ అనుకూలస్తులకే షెడ్లను కేటాయించింది.
కనుమరుగయ్యే ప్రమాదం..
మార్కెట్లో నాటుకోడికి డిమాండ్ పెరుగుతున్నా.. కోళ్ల పెంపకంపై రైతులు వెనకడుగు వేస్తుండటంతో దేశవాళీ నాటుకోడి భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 70శాతం ఆర్థిక సాయం, రైతు వాటా 30శాతంతో కోళ్ల షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని ప్రోత్సహించకుండా 90శాతం ఆర్థికసాయం ఉన్న పశువుల షెడ్లను మాత్రమే ప్రోత్సహించి తమ అనుకూలస్తులకు ఈ షెడ్లను కట్టబెట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో 724షెడ్లు మంజూరు కాగా ఒకటి రెండు మినహా మొత్తం పశువుల షెడ్లనే నిర్మించింది. గతంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై నాటుకోడి పిల్లలను సరఫరా చేసి కోళ్ల పెంపకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించేవి. ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో నాటుకోళ్ల పెంపకం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నాటుకోళ్ల పెంపకానికి రాయితీలు ఇచ్చి రైతులను, డ్వాక్రా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తే తప్ప ఉత్పత్తి పెరిగే అవకాశం కనిపించడంలేదు.
సంకరజాతి నాటు కోళ్లు..
నాటుకోడి మాంసానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దేశవాళీ నాటుకోడి ఇంటి వద్ద ధాన్యం, వివిధ రకాల గడ్డిజాతి మొక్కలు, పురుగులు, నత్తలు వంటి వాటిని ఆహారంగా తీసుకొని సాధారణంగా పెరుగుతుంది. వీటిని రైతులు తమ వ్యవసాయ అనుబంధంగా ఇంటి వద్ద అదనపు ఆదాయం కోసం పెంచుతుంటారు. అయితే కాలక్రమేణా నాటుకోడికి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచేందుకు కొందరు ప్రత్యేకంగా ఫారాలు ఏర్పాటు చేసి సంకరజాతి నాటుకోళ్లను పెంచి విక్రయిస్తున్నారు. వీటిలో వనరాజా, గిరి రాజా, రాజశ్రీ, కడక్‌నాథ్, స్వర్ణధార, సోనాలి, కారీ నిర్‌బిక్, కారీ శ్వామా, హితకారీ, ఉపకారి వంటి జాతులకు చెందిన కోళ్లను పెంచి విక్రయిస్తున్నారు. ఈ జాతులకు చెందిన కోడి మాంసం దేశవాళీ నాటుకోడి మాంసానికి సాటిరాదు. అయినప్పటికీ ఈ జాతులకు చెందిన కోళ్లను సైతం ఒరిజినల్ నాటుకోడి అని చెప్పి కేజీ మాంసం రూ.600నుంచి రూ.800వరకు విక్రయిస్తున్నారు.
ప్రతికూల పరిస్థితులు తట్టుకోలేక..
సంకరజాతి నాటుకోళ్లను ఇళ్ల వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాలు, మామిడి తోటల్లో పెంచేందుకు ఏర్పాట్లు చేసి కొంతకాలం పాటు పెంచారు. అయితే ఈ కోడిపిల్లల కొనుగోలు, పెంపకం ఖర్చుతో కూడుకోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వ్యాధుల వల్ల కోళ్లు మృత్యువాత పడడంతో నష్టాలను చవిచూసి వదిలేశారు. ఇళ్ల వద్ద సాధారణంగా పెరిగే నాటుకోళ్లు సైతం ఇటీవల వచ్చిన రాణికట్, కొక్కెర వ్యాధులతో మృత్యువాత పడడంతో రైతులు కోళ్ల పెంపకానికి వెనకడుగు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 2వేల నాటుకోళ్ల సామర్థ్యంతో ఎనిమిది ఫారాలు మాత్రమే నిర్వహిస్తున్నారు.
నాటు కోడి.. బలవర్థకం
నాటుకోడి మాంసం కొవ్వు తక్కువగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నాటుకోడి మాంసం పాత్ర వేరే లెవెల్‌లో ఉంటుంది. దీనిలో ప్రోటీన్‌లు, ఐరన్, విటమిన్‌లు అధికంగా ఉంటాయి. అయితే మితంగా తింటేనే అది మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
గిరాకీ ఉంది.. ప్రోత్సాహమే లేదు!


