దౌర్జన్యంగా ఇండస్ట్రీ షెడ్డు కూల్చివేత
వాచ్‌మన్‌ను కొంత సమయం బంధించిన వైనం కోర్టు ఉత్తర్వులు ఉన్నా టీడీపీ నాయకుడి బరితెగింపు
రోడ్డుకింద స్థలం పోయిందని..
భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పంచాయతీ పరిధిలోని నల్లకుంటలో ఒక పరిశ్రమకు సంబంధించిన షెడ్డును దౌర్జన్యంగా కూల్చివేసి, ఆపై భారీగా మట్టి డంపింగ్ చేయడం అందుకు నిదర్శనంగా నిలిచింది. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ టీడీపీ నాయకుడి బరితెగింపుపై స్థానికులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. స్థల వివాదంపై న్యాయపరంగా వెళ్లాల్సిందిపోయి జేసీబీతో కూల్చివేయడం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. స్థల యజమాని మన్నె నాయుడు బాబు, భవానీపురం పోలీసుల కథనం మేరకు.. రాయనపాడు రోడ్డులో నల్లకుంటలో ఆర్‌ఎస్ నంబర్ 7/3లో మన్నె నాయుడుబాబు భార్య మన్నె చిలకమ్మకు ఎకరం 32 సెంట్ల స్థలం ఉంది. దానిని భవానీపురానికి చెందిన శిరిగిరి వెంకటేశ్వర్లురెడ్డికి నాలుగేళ్ల క్రితం లీజుకు ఇచ్చారు. వెంకటేశ్వరరెడ్డి ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఫొటో ఫ్రేమ్స్ తయారు చేసే ఇండస్ట్రీ నిర్వహిస్తున్నారు. దాని పక్కనే బొమ్మసాని బుల్లికోటయ్య స్థలంలో మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఇద్దరి స్థలాల మధ్యలో దాదాపు 23 ఏళ్ల క్రితం బుల్లికోటయ్య సరిహద్దు గోడ నిర్మించారు. మూడు నెలల క్రితం ఆ గోడను ఆయనే కూల్చివేయగా మన్నె నాయుడుబాబు కోర్టుకు వెళ్లి యథాతథ స్థితి కొనసాగించాలని ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు.
వాచ్‌మన్‌ను బంధించి కూల్చివేత
సోమవారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో బుల్లి కోటయ్య కుమారుడు సాంబశివరావు మనుషులు వచ్చి ఆదిత్య ఎంటర్ ప్రైజెస్‌లో నైట్ వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఆర్.అర్జునరావును బలవంతంగా తీసుకువెళ్లి తమ షెడ్డులో బంధించిన అనంతరం సొంత జేసీబీ ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన షెడ్డును కొంతభాగం కూల్చి, వెనువెంటనే దానిపై టిప్పర్లతో తీసుకువచ్చిన మట్టిని డంప్ చేశారు. షెడ్డులో ఉన్న మెషినరీ, మెటీరియల్ మట్టికింద పూడిపోయాయి. ఈ తతంగం పూర్తయ్యాక వాచ్‌మన్‌ను వదిలేశారు. అనంతరం వాచ్‌మెన్ అర్జునరావు ఇండస్ట్రీ యజ మాని వెంకటేశ్వరరెడ్డి, నాయుడుబాబుకు సమాచారం ఇచ్చారు. దీనిపై తాము సోమవారం భవానీపురం పోలీస్‌లకు ఫిర్యాదు చేయటంతోపాటు కలెక్టర్ ఆఫీస్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌లోన్యాయం చేయాలని అర్జీ పెట్టుకున్నట్టు నాయుడుబాబు తెలిపారు. ఈ ఘటనపై వెంకటేశ్వరరెడ్డి కూడా భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాయుడుబాబు, బుల్లి కోటయ్య స్థలాల మధ్య ఉన్న 32 సెంట్ల స్థలం రోడ్డు కింద పోయిందని, అయితే రోడ్డు కింద పోయింది మీ స్థలమేనంటూ బుల్లికోటయ్య దౌర్జన్యంగా తమ స్థలంలోకి జొరబడి షెడ్డు కూల్చివేశారని మన్నె నాయుడు బాబు ఆరోపించారు. అసలు రోడ్డు కింద ఎవరి స్థలం ఎంత పోయిందనే విషయంలో వీఆర్‌ఓ, సర్వేయర్ తమకు వివరించలేదని, దీంతో ఆర్‌డీఓకు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కూల్చివేత ఘటన గొల్లపూడికి చెందిన ఓ టీడీపీ నాయకుడి నేతృత్వంలోనే జరిగిందని ఆరోపిస్తున్నారు.
దౌర్జన్యంగా ఇండస్ట్రీ షెడ్డు కూల్చివేత


