తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
తమకు జరిగిన నష్టాన్ని వివరించిన రైతులు, కౌలురైతులు తమను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరిన బాధితులు
కంకిపాడు: మోంథా తుపానుతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అంతర మంత్రిత్వ కేంద్ర అధికారుల బృందం సోమవారం కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో పర్యటించింది. వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.పొన్నుసామి నేతృత్వంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఎంఏడీటీఈ, సీడబ్ల్యూసీ డైరెక్టరు శ్రీనివాసు బైరీ, విద్యుత్ మంత్రిత్వశాఖ సీఈఏ డెప్యూటీ డైరెక్టర్ ఆర్తీసింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ మీనాతో కూడిన ఈ బృందం పంట నష్టాన్ని అంచనా వేసింది. పునాదిపాడులో కౌలురైతులు పిడికిటి భరత్‌బాబు, తూముల శ్రీనివాసరావు సాగు చేసిన 1318 రకం వరి పైరును బృందం సందర్శించింది. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్, శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ తుపాను కారణంగా రైతులకు జరిగిన పంట నష్టాన్ని వివరించారు.
రైతులతో ముఖాముఖీ..
కేంద్ర అధికారుల బృందం పునాదిపాడులో రైతులతో ముఖాముఖీ మాట్లాడింది. తుపానుకు పంట దెబ్బతినడంతో ఎకరాకు రూ.30 వేల కౌలు, రూ.30 వేల వరకూ పెట్టుబడులు నష్టపోయామని కౌలు రైతులు వివరించారు. ఎకరాకు 45 బస్తాలకు పైగా దిగుబడులు వస్తాయనుకుంటే పది బస్తాలు కూడా వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన పంట కోత కోయించేందుకు ఎకరాకు రూ.12 వేలకు పైగా ఖర్చవుతుందని వివరించారు. ధాన్యం రంగుమారినా, దెబ్బతిన్నా మద్దతు ధరకు కొనాలని విజ్ఞప్తిచేశారు. పెదకరాల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. పంట రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ వివరించారు. మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు, ఏపీ రైతు, కౌలురైతుల ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎం.హరిబాబు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి.వెంకటేశ్వర్లు, వి.శివనాగరాణి, పి.పవన్, ఎ.అప్పలస్వామి, పి.జమలయ్య తదితరులు రైతులకు జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకుడు, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఎస్.ఢిల్లీరావు, జేసీ ఎం.నవీన్, తుపాను నోడల్ అధికారి పోతురాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, సివిల్ సప్లయీస్ జీఎం టి.శివరామ్, ఉయ్యూరు ఆర్‌డీఓ హెలా షారోన్, తహసీల్దార్ వి.భావనారాయణ, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ సుధారాణి, వ్యవసాయాధికారి ఉషారాణి పాల్గొన్నారు.


