ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీకమాసం సందర్భంగా ఆదివారం భక్తులు, పంచారామ యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు స్వామికి మహాన్యాస పూర్వక అభిషేకాలు చేయించుకున్నారు. అభిషేకాల అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని అత్యంత వైభవంగా అలంకరించారు. మధ్యాహ్నం నుంచి పంచారామ యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు స్వామివారి అలంకరణను తిలకించారు. ఆలయంలో పడమర వైపు ప్రహరీగోడ ప్రమాదకర పరిస్థితుల్లో ఉండడంతో కర్రలు కట్టి ప్రదక్షిణలను నిలుపుదల చేశారు.
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా అంటూ భక్తులు ఆర్తీతో అమ్మను వేడుకున్నారు. అమ్మవారి దేవస్థానానికి సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు అమ్మకం, వాహన పూజలు, భక్తుల విరాళాల ద్వారా రూ.23,365 ఆదాయం వచ్చిందని తెలిపారు.
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి


