పోలీసులకు సమాచారం ఇచ్చిన నిందితుడు
మానసిక రోగిగా ప్రాథమిక నిర్ధారణ
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి తల్లి, సోదరుడిని చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. సోమవారం తెల్లవారుజామున గునుపూటి మహాలక్ష్మి (60), గునుపూటి రవితేజ(33) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోయడానికి ఉపయోగించే చాకుతో నిందితుడు గునుపూటి శ్రీనివాస్ వారిని కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఒకటో పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి, పెద్ద కుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు రవితేజతో కలిసి నివసిస్తుండగా, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. మృతురాలి భర్త కోవిడ్ సమయంలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పెద్ద కొడుకు శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటాడని, అప్పుడప్పుడూ మాత్రమే బయటకు వస్తుంటాడని చెబుతున్నారు. శ్రీనివాస్‌కు వివాహం కాలేదు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్య చేసి.. 112కు ఫోన్
హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ నేరుగా డయల్ 112కు ఫోన్ చేసి హత్య వివరాలు తెలిపాడు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగా.. వారిద్దరినీ తానే చంపానని, వాళ్లు దెయ్యాలని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో తనను బంధించారని, తన మనసులో ఏం మాట్లాడుకుంటున్నా అది వాళ్లిద్దరికీ తెలిసిపోతోందని, ఎంత పొడిచినా వాళ్లిద్దరూ రక్తపు మడుగులో కొట్టుకోవడం చూస్తే బతికి వచ్చి మళ్లీ తనను ఇబ్బంది పెట్టేలా ఉన్నారని చెప్పాడు. అతని మాట తీరు, చెప్పిన సమాధానాలను బట్టి అతనికి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


