స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం స్ఫూర్తిదాయకం
చల్లపల్లి: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని అందిపుచ్చుకుని స్వచ్ఛ చల్లపల్లిని ప్రారంభించి ఉద్యమంగా ముందుగు తీసుకువెళుతూ అందరికీ ఆదర్శంగా నిలవటం అభిందనీయమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం స్వచ్ఛ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణయ్య, కలెక్టర్ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి(హైదరాబాద్) వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీ గురవారెడ్డి, విజయవాడకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కాలేషావలి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా 216 జాతీయ రహదారిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నూతనంగా జంక్షన్ పాయింట్‌లో ఫ్లడ్‌లైట్ల స్థంభాన్ని అతిథులచే ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శ్మశానవాటిక, వర్మీ కంపోస్టును, డంపింగ్ యార్డును తిలకించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డు వద్ద అందరూ గ్రూప్ ఫొటో దిగారు. గతంలో స్వచ్ఛ కార్యక్రమానికి ముందు తరువాత చల్లపల్లి పరిసరాల ఫొటోలను వైద్యులు డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు చూపించారు.
యువతను ప్రోత్సహించాలి..
అనంతరం స్వగృహ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులను, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలలో యువతను ప్రోత్సహించాలని తద్వారా భవిష్యత్తులో కూడా ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగటానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కాలేషావలి మాట్లాడుతూ.. సమాజంలో పేరుకుపోయిన చెత్తను తొలగించటం వల్ల దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త తన ప్రవచనాల్లో పేర్కొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలె నాగమణి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలుష్య నియంత్రణ
బోర్డు చైర్మన్ కృష్ణయ్య


