ప్రసూతి సేవలకు మంగళం
మోర్తాడ్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు మార్పు కార్యక్రమాన్ని చేపట్టినా మోర్తాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మాత్రం సేవలు అందడం లేదు. గైనకాలజిస్ట్, మత్తు వై ద్యులు రాకపోవడంతో మూడున్నర సంవత్సరాల నుంచి మోర్తాడ్‌లో ప్రసవ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంత గర్భిణులు ప్రసవం కోసం ఆర్మూర్, మెట్‌పల్లిలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మోర్తాడ్ ఆసుపత్రిని వైద్య విధానపరిషత్‌లో విలీనం చేసినా సేవలు మెరుగుపడలేదు. మోర్తాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, వేల్పూర్, మండలాలు ఉన్నాయి. సాధారణ ప్రసవాలను చౌట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేస్తుండగా, 2018 నుంచి శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలను మాత్రం మోర్తాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రారంభించారు. మార్పు పథకం అమలుతో మోర్తాడ్ ఆస్పత్రిలో రికార్డు సంఖ్యలో ప్రసవాలు చేశారు. సుమారు మూడు సంవత్సరాల పాటు గైనకాలజిస్టులు, మత్తు వైద్యులను ఆర్మూర్ నుంచి రప్పించి గర్భిణులకు సేవలు అందించారు. ప్రతి బుధ, శుక్ర వారాల్లో గర్భిణులకు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు చేసేవారు. శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేసినందుకు గైనకాలజిస్ట్, అనస్థీషియాకు రూ.2,500 చొప్పున చెల్లించేవారు. అయితే ప్రభుత్వం చెల్లించే పారితోషికం తక్కువగా ఉండటంతో వైద్యులు ఆసక్తి చూపలేదు. క్రమంగా ప్రభుత్వం వైద్యులకు ఇచ్చే పారితోషికం అంశం మరుగున పడడంతో వైద్య సేవలకు మంగళం పలికినట్లయ్యింది. ఎంతో మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులు ప్రసవం కోసం మోర్తాడ్ ఆస్పత్రికి వస్తుండగా ఇక్కడ సేవలు అందకపోవడంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ఆర్మూర్, మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో భారీగా ఫీజు వసూలు చేస్తుండటంతో పేదలకు, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రసవ సేవలను మోర్తాడ్‌లో పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు.
మోర్తాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో
మూడున్నరేళ్లుగా సేవలు బంద్
ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పపత్రి లేదా
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిందే..
తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణులు


