ధాన్యం సేకరణలో జిల్లాకు అగ్రస్థానం
నిజామాబాద్ అర్బన్ : ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు యాభై శాతం మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేశారని కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ప్రస్తుత నవంబర్ నెల ఎంతో కీలకమని, మరో మూడు వారాలపాటు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంట కొనుగోళ్లు సాఫీగా సాగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని మంత్రులకు తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంలో సన్న రకం 3.21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దొడ్డు రకం 25.9 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు. 34,328 మంది రైతుల ఖాతాల్లో ధాన్యానికి సంబంధించి డబ్బులు రూ.549.85 కోట్లు జమ చేశామన్నారు. సోమవారం ఒక్క రోజే రూ.105 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాలను కూడా రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట ఏర్పాటు చేసి పంట పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నామన్నారు. మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్లకు పెంచాలని తాను చేసిన ప్రతిపాదనను అనుమతించడంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని, వారు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే రికార్డు స్థాయిలో
3.47 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
34,328 మంది రైతులకు రూ.549.85 కోట్ల బిల్లుల చెల్లింపులు
కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి


