రూరల్ ఎమ్మెల్యే పీఏకు షోకాజ్ నోటీసులు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌రెడ్డికి జిల్లా విద్యాశాఖాధికారి పార్శి అశోక్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రజాప్రతినిధుల వద్ద ఉపాధ్యాయులు పీఏలుగా పని చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే వద్ద పీఏగా పని చేస్తున్నారని మోపాల్ మండలం సిర్పూర్‌కు చెందిన బొడ్డు గోపాల్ గత నెల 25న జిల్లా హ్యుమన్ రైట్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో డీఈవో పార్శి అశోక్‌తోపాటు ధర్పల్లి ఎంఈవో రమేశ్, మైలారంలోని జెడ్పీ హైస్కూల్ ఇంగ్లిష్ టీచర్ గడ్డం శ్రీనివాస్‌రెడ్డికి అక్టోబర్ 31వ తేదీన కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న హుమ్యాన్ రైట్స్ కోర్టులో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ అధికారులు శ్రీనివాస్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీ సులకు పీఏ శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివాదాస్పదమైన టీచర్
శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం
సుప్రీం తీర్పును ఉల్లంఘించారని ఫిర్యాదు


