భూగర్భ జలం మరింత పైకి
నెలల వారీగా భూగర్భ జల మట్టం వివరాలు (మీటర్లలో..)
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జల మట్టం అసాధారణ రీతిలో పెరిగింది. అక్టోబర్ నెలాఖరున కురిసిన ఒక్క భారీ వర్షానికే పాతల గంగమ్మ పైకి పొంగుకొచ్చింది. సెప్టెంబర్ వరకు 6.03 మీటర్ల లోతులో ఉన్న జలాలు అక్టోబర్ ముగిసే నాటికి సరాసరి 5.58 మీటర్లకు వచ్చాయి. అంటే ఒక్క నెలలోనే దాదాపు అర మీటరు (0.45) మేర పెరిగాయి. గతేడాది అక్టోబర్ (7.10 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఇది. వర్షాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 113 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, ఇందులో 80 శాతం మేర వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే కురిశాయి. గత నెల 30వ తేదీన అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తి భూగర్భంలో ఊట భారీగా చేరింది. దీంతో జిల్లా అంతటా భూగర్భ జలాలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ ముగిసే నాటికి సరాసరిగా 6.83 మీటర్ల మేర పెరిగాయి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టం కావడంతో వచ్చే ఏడాది వరకు బోరుబావులకు, పంటలకు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారి శ్రీనివాస్ బాబు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
అక్టోబర్ మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్ తీసింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్ల ద్వారా నీటి లెక్కలను సేకరించింది. ఇందులో 71 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 09 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా రెండు ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే, జిల్లా వ్యాప్తంగా 90 శాతం వరకు భూగర్భ జలాలు పుష్కలంగా విస్తరించి ఉన్నాయి.
అక్టోబర్‌లో మరో అర మీటరు
పెరిగిన జలమట్టం
ప్రస్తుతం జిల్లాలో సరాసరి
నీటి మట్టం 5.58 మీటర్లు
భూమి పొరల్లోకి అసాధారణంగా చేరిన నీరు


