సాక్షి, బనశంకరి: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు యథేచ్ఛగా సౌకర్యాలు పొందుతున్నారని తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరడుగట్టిన నేరగాళ్లు కటకటాల నుంచి ఫోన్లలో బయట వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు విమర్శలున్నాయి. తాజాగా ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు జైలులో సోదాలను జరిపారు. అయితే మొబైల్స్‌తో పాటు ఎలాంటి వస్తువులు లభించలేదు. అత్యాచారం కేసులో దోషి ఉమేశ్‌రెడ్డి మొబైల్‌ఫోన్‌లో మాట్లాడుతూ టీవీ చూడటం, లష్కరే ఉగ్రవాది మొబైల్ వాడడం, బంగారం కేసు నిందితుడు అక్రమంగా సౌకర్యాలు పొందడం తదితరాలపై శనివారం ఫోటోలు, వీడియోలు గుప్పుమన్నాయి, దీంతో జైలు అధికారులు ముందే జాగ్రత్త పడినట్లు సమాచారం.
Now videos of booze, bar snacks and parties have emerged from Bengaluru Central Jail. A high level meeting has been called by the Home Minister to probe all these issues. https://t.co/gIOf6Wr5Ke pic.twitter.com/8NZnIs5sBL
— Deepak Bopanna (@dpkBopanna) November 9, 2025
రౌడీ.. కేక్ కటింగ్
జైళ్ల శాఖ చీఫ్ దయానంద్ పరప్పన అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఆ వీడియోల గురించి అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. కొన్నిరోజుల కిందట జైలులో రౌడీషీటర్ గుబ్బచ్చి శీనా పుట్టినరోజు కేక్ కట్‌చేయడం తీవ్రవిమర్శలకు దారితీసింది. విచారణ ఖైదీలకు ఎల్‌ఇడీ టీవీ సౌలభ్యంతో పాటు వంట చేసుకోవడానికి పాత్రలు, వంట పదార్థాలు, లభిస్తాయి. కానీ కోడిగుడ్లు, చికెన్, మొబైల్ చార్జర్ , పార్టీ చేసుకోవడానికి సౌండ్‌బాక్స్ తదితరాలు పొందడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు ఖైదీలకు రాజమర్యాదలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానిత ఐసిస్ ఉగ్రవాది జుహద్ షమీద్ షకీల్ మున్నా జైలులో మొబైల్ వాడుతున్నట్లు లీకైంది.
చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
జైలులో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మంగళూరు, బెళగావితో పాటు చాలా చోట్ల అదికారులను సస్పెండ్ చేశామన్నారు. గతంలో పరప్పనలోనూ కొందరిపై వేటు వేశామన్నారు. ఏడీజీపీ దయానంద్ తో మాట్లాడానని, కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్షణం నివేదిక అందించాలని సూచించానని, జైలులో మొబైల్ ఇతర సౌలభ్యాలు ఎవరికీ లేవని చెప్పారు. సౌలభ్యాలను కలి్పస్తే అది జైలు ఎలా అవుతుందని , ఉగ్రవాదులతో పాటు ఎవరికీ రాజమర్యాదలు కల్పించరాదని చెప్పారు. బెడ్, దిండు కోసం నటుడు దర్శన్ కోర్టుకు వెళ్లారని, ఇతర ఖైదీలకు సులభంగా ఎలా లభిస్తున్నాయనేది తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
నేడు సీఎం సమీక్ష..
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రలు జైలులో ఖైదీలకు రాచమర్యాదలు కల్పిస్తున్నారనే ఆరోపణపై అధికారులతో నేడు (సోమవారం) ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాను, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఆయన ఆదివారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకాలో మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ కుమారుడు భరత్ వివాహ వేడుకలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. జైలులో అక్రమాల గురించి ప్రస్తావించగా, అవకతవకలకు కొమ్ముకాస్తున్న జైలు అధికారులపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు.
ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌నే కాదు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను నిషేధించాలని కోరుతున్నామని చెప్పారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల మీద హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. మొక్కజొన్నకు కేంద్రం మద్దతు ధరను కలి్పంచాలని కోరారు. అతివృష్టి వల్ల రాష్ట్రంలో 11 లక్షల హెక్టార్లలో పంటనష్టం ఏర్పడిందని, పరిహారం ఇవ్వడానికి సర్కారుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెరకు రైతులకు మద్దతు ధర ఇవ్వని చక్కెర ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


