కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కీలక వ్యాఖ్యలు
శివాజీనగర/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే బుధవారం కర్ణాటక భవన్‌లో మీడియాతో మాట్లా డుతూ, ‘సీఎం సిద్ధరామయ్య హైకమాండ్ కోర్టులో బంతి వేశారు. హైకమాండ్‌కు సమస్య కలిగించబోను. రాహుల్‌గాంధీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలో హైకమాండ్ నేతలు ఎవరితోనూ తాను సమావేశం కాలేదని కూడా స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఎలాంటి ఊహాగానాలు లేవని, అల్పాహార విందులు మా మూలు విషయాలేనని కూడా అన్నారు. మైసూరులో సీఎం సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన వర్గీయు లు బీసీ, దళిత (అహింద) సమావేశం జరపబో తున్నారన్న వార్తలను ప్రస్తావించగా, అదంత మంచిది కాదని సమాధానం చెప్పారు.
ముఖ్యమంత్రి కుర్చీ మార్పి డి వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య పట్టువీడకపోవడం.. హైకమాండ్ కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం.. స్థానికంగానే ఈ సమస్యను పరిష్కరించుకుంటారంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటన వంటి పరిణామాల నేపథ్యంలో శివకుమార్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంత రించుకుంది. దీనితో ఈ అంశంపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రం: మంత్రి జమీర్
కాగా, సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రంగా ఉందని కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బుధవారం విలేకరులతో అన్నారు. 2028 వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు. ‘హైకమాండ్ తప్ప వేరే ఎవరి వల్లా సీఎం సీటు నుంచి సిద్ధరామయ్యను తొలగించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు.


