ఆమెకు సుస్తీ!
ఇటీవల ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్’ అమలు 80 వేల మంది మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు పలురకాల వ్యాధులతో బాధపడుతున్నట్లు నిర్ధారణ
నిర్మల్‌చైన్‌గేట్:ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం చక్కగా నడుస్తుంది అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. జిల్లాలో మహిళలు వ్యవసాయంలోనూ కుటుంబ జీవితంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. గృహపనులతోపాటు పొలంలోనూ కృషి చేస్తున్న ఈ మహిళల ఆరోగ్యంపై అవగాహన తక్కువ. అందుకే గ్రామీణ మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం కేంద్రం స్వస్త్ నారీ సశక్తి పరివార్ యోజన ప్రారంభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17 నుంచి మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. భైంసా ఏరియా ఆస్పత్రి, 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లు, 59 సబ్ సెంటర్లు, నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఖానాపూర్, నర్సాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక శిబిరాలు ఏ ర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్ల ల వైద్యం, సైకియాట్రి, డెంటల్, చర్మ, ఈఎన్టీ, స ర్జరీ తదితర విభాగాల వైద్యులు సేవలందించారు.
80 వేల మందికి వైద్య సేవలు
కార్యక్రమం భాగంగా మొత్తం 732 శిబిరాలు నిర్వహించారు. ఇందులో 95 ప్రధాన శిబిరాలు, 637 ఇంటింటి సర్వేలు భాగమయ్యాయి. ఈ క్రమంలో 80 వేలమంది మహిళలను వైద్యులు సమగ్రంగా పరీక్షించారు. ఎక్కువగా బీపీ, షుగర్, రక్తహీనత, గర్భస్థ సమస్యలు, క్యాన్సర్, టీబీ, హెచ్‌బీ, సికిల్ సెల్ వంటి వ్యాధుల లక్షణాలు గుర్తించారు. సుమారు 16,548 మందికి బీపీ, షుగర్, రక్తహీనత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి తక్షణంగా మందులు అందించగా, తీవ్రమైన స్థితిలో ఉన్న వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
ఇటీవలి పరీక్షల్లో వ్యాధులు,
నిర్ధారణ అయిన వారి సంఖ్య..
బీపీ 9,050 షుగర్ 6,907
క్యాన్సర్ 1,724 అనీమియా 2,598
గైనిక్ 1,361 టీబీ 1,668
సికిల్ సెల్ 50
పకడ్బందీగా పరీక్షలు..
ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు జిల్లా వ్యాప్తంగా స్వస్ట్ నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అన్ని ఆస్పత్రుల్లో క్యాంపులు పెట్టి మహిళలకు పరీక్షలు నిర్వహించాం. నివేదికను ఉన్నతాధికారులకు అందించాం.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో


